భయంతో బీజేపీ ఎంపీల సమావేశాలు వాయిదా
భయంతో బీజేపీ ఎంపీల సమావేశాలు వాయిదా
Published Sat, Nov 19 2016 3:59 PM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM
పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్ ఉభలు దద్దరిల్లుతున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పాలకపక్ష బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశాన్ని పార్టీ అధిష్టానం రెండుసార్లు అర్ధాంతరంగా వాయిదావేసింది. అందుకు కారణాలు వెల్లడించలేదు. పార్లమెంట్ లోపల, బయట నోట్ల వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో కూడా పార్టీ ఎంపీలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేసే అవకాశం ఉందని గ్రహించి రద్దు చేశారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు బీజేపీ ఎంపీలు మీడియాకు తెలిపారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారభమైన తొలి రోజే బీజేపీ ఎంపీల సమావేశాన్ని పార్టీ అధ్యక్షులు అమిత్‌షా ఏర్పాటుచేశారు. సాయంత్రం ఏడు గంటలకు సమావేశం ఉందంటూ పార్టీ ఎంపీలందరికి ఆ రోజు నాలుగు గంటలకు కబురు పంపారు. ఆ తర్వాత కారణం చెప్పకుండా సమావేశం వాయిదా పడిందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని బీజేపీ పోరబందర్ ఎంపీ విఠల్ రాడాడియా బహిరంగంగా విమర్శించిన నేపథ్యంలో ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మరికొందరు కూడా విమర్శించే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావించింది.
ఆ తర్వాత శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు ముందే పార్టీ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ప్రతిపక్షాల ఎదురుదాడిని ఎలా తిప్పికొట్టాలో, సభలోపల పరస్పర సహకారం ఎలా ఉండాలో వివరించేందుకు, సరైన వ్యూహాన్ని నిర్దేశించేందుకు పార్టీ ఈ సమావేశానికి పిలుపునిచ్చింది. 'పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి, వాటి వెనకనున్న ఉద్దేశాల గురించి వివరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుందని చెప్పారు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ లోక్‌సభ సభ్యుడొకరు తెలిపారు.
ఆ తర్వాత సమావేశం రద్దయిందని కబురు పంపారుగానీ, కారణం వివరించలేదని ఆయన చెప్పారు. సమావేశంలో విమర్శలు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందనే ఉద్దేశంతోనే సమావేశాన్ని రద్దు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరుగుతుందని తనకు చెప్పినట్లు మరో బీజేపీ ఎంపీ తెలిపారు. శుక్రవారం నాడు పార్లమెంట్ చర్చపై ఓటింగ్ జరిపే అవకాశం లేకపోయినా బీజేపీ అదిష్టానం తన ఎంపీలందరూ పార్లమెంట్‌కు రావాలంటూ విప్ జారీ చేసింది. కొన్నిరోజుల్లో నోట్ల హీట్ దేశంలో తగ్గిపోతుందని, అప్పుడు ఎంపీల సమావేశం ఏర్పాటు చేయడం మంచిదని పార్టీ అధిష్టానం భావిస్తోన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Advertisement