అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే
- రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం
- కేంద్రం ఇచ్చింది ముష్టి రూ. 36 వేల కోట్లు
- రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై టీఆర్‌ఎస్ విరుచుకుపడింది. ఆయన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తింది. తెలంగాణకు కేంద్రం ఈ రెండేళ్లలో ముష్టి రూ.36 వేల కోట్లు విదిల్చగా, రూ.90 వేల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణకు చాలా సాయం చేస్తున్నామని, తామిచ్చిన డబ్బు ప్రజలకు చేరడం లేదని అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ రాములునాయక్‌లతో కలసి ఆయన శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలు కేంద్రం వద్ద భిక్షమెత్తుకోవని, కేంద్ర ప్రభుత్వ ఆర్థికశక్తి ఆకాశం నుంచి ఊడిపడలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రాలే వివిధ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లిస్తున్న విషయం మరిచిపోవద్దన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు 2014-15లో సీఎస్‌ఎస్ కింద రూ.5,028 కోట్లు, సెంట్రల్ ట్యాక్స్ కింద రూ. 8,189 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద రూ.19 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.2,110 కోట్లు మొత్తంగా రూ.15,345 కోట్లు వచ్చాయని, ఇవే పద్దుల కింద 2015-16లో రూ.19,944 కోట్లు విడుదల చేశారని మంత్రి చెప్పారు. ఈ రెండేళ్లలో రూ.35,289 కోట్లు మాత్రమే అందాయన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా, అవాస్తవాలు మాట్లాడడం ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నేతకు తగదని హితవు పలికారు. రెండేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా ఆదరణ పొందలేకపోయిందని, చివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఒకవైపు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని, పథకాలను మెచ్చుకుంటుండగా, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు విమర్శలకు దిగడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణకి అద్దం పడుతోందన్నారు.
భారీ మెజారిటీ తో కేంద్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే చేసిందేమిటని ఈటల ప్రశ్నించారు. ప్రధాని విదేశాల్లో విహరించడం తప్ప దేశ ప్రజల మనసులు దోచుకునే విధంగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు. అంగన్‌వాడీలకు యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.15,800 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కేవలం రూ.8 వేల కోట్లకు కుదించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇలాంటి చర్యలతో తాము పేదల పక్షంకాదని, కార్పొరేట్ వర్గాల పక్షమని ఎన్డీయే సర్కారు నిరూపించుకుందన్నారు. ‘‘కేంద్రం సాయం చేయకున్నా ఫర్వాలేదు. మా కాళ్లలో కట్టె పెట్టే చర్యలు ఆపండి.’’ అని ఈటల పేర్కొన్నారు.
బీజేపీవి ఉల్టా పల్టా మాటలు: మహమూద్ అలీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో ఉల్టా పల్టా మాటలు మాట్లాడారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు. ఈ రెండేళ్లలో కేంద్రం తెలంగాణకు మద్దతుగా నిలవలేదన్నారు. కరువు సాయం కింద రూ.3 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కోరితే కేంద్రం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. విదేశాల్లో తిరిగే ప్రధాని మోదీకి పేదల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణకు ఐఎఎస్ అధికారులను కేటాయించకుండా ఇబ్బందుల పాలు చేసింది కేంద్రం కాదా అని నిలదీశారు.