ఏపీ ఉన్నత విద్యారంగంలో మరో మైలురాయి
విశ్వస్థాయి యూనివర్శిటీలు వస్తే ఆహ్వానిస్తామన్న సీఎం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమిటీ యూనివర్శిటీ తన శాఖను ఏర్పాటు చేయనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మంగళవారమిక్కడ అమిటీ యూనివర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ అతుల్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంతో భేటీ అయ్యింది. అమరావతిలో తమ శాఖ ఏర్పాటుకు బృందం ఆమోదం తెలిపింది. 2017 నుంచి అమిటీ విశ్వవిద్యాలయం సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్లు ప్రారంభించడానికి అంగీకారం తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అమరావతిలో శాఖలు ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యార్ధులు ఏ రంగంలోనైనా సరే.. వారికి అత్యుత్తమ, ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించే యూనివర్శిటీలు వస్తే స్వాగతిస్తామని, ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నాణ్యమైన విద్యనందించే యూనివర్శిటీలు రావటానికి, అత్యుత్తమ నిపుణులు వచ్చి సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. విదేశీ విశ్వవిద్యాలయాల సహకారం తీసుకొని సంయుక్తంగా డిగ్రీ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన డా. చౌహాన్ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్ధులు ఎవ్వరూ ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే పరిస్థితి రాకూడదన్నది తమ అభిమతమని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలన్నది తమ ధ్యేయమని, పరిశోధనాత్మక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దిన యూనివర్శిటీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను విద్యాకేంద్రం (నాలెడ్జి హబ్)గా తీర్చిదిద్దటంలో రాష్ట్రప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని ఆయన ముఖ్యమంత్రితో అన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో 2003లో అమిటీ వర్శిటీ ప్రైవేటు విశ్వవిద్యాలయంగా ప్రారంభమైందని, అంచెలంచెలుగా ఎదిగి అనేక రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. పశ్చిమ బెంగాల్‌లో అమిటీ విశ్వవిద్యాలయం కేవలం 7 నెలల కాలంలో అనూహ్యంగా విస్తరించిందని తెలిపారు. దేశంలో సుమారు 250 కోర్సులలో విద్యాబోధన జరుపుతున్న అతి కొద్ది విశ్వవిద్యాలయాల్లో తమది ఒకటి అని చెప్పారు. అమిటీ విశ్వవిద్యాలయం వివిధ రాష్ట్రాలలో 11 యూనివర్శిటీ శాఖలను నెలకొల్పిందని, 20 క్యాంపస్‌లను, 18 విభాగాల్లో బోధనా విభాగాలను ఏర్పాటు చేసిందని వివరించారు.
అమిటీలో అనువజ్ఞులైన ఫ్యాకల్టీ మెంబర్లున్నారని, 60 దేశాల విద్యార్ధులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని డా. చౌహాన్ తెలియజేశారు. రాష్ట్రంలో అంకుర విద్యా ప్రాంగణాల (ఇంక్యుబేటర్ క్యాంపస్‌లు) ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఇందువల్ల పరిశోధనాత్మక విద్య నేర్చిన అనుభవం విద్యార్ధులకు వస్తుందని, ప్రోగ్రాంల ఎక్ఛేంజికి ప్రోత్సాహం లభించినట్లు ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి జి.సాయిప్రసాద్, అమిటీ యూనివర్శిటీ ప్రతినిధులు డా. ప్రసాదరావు, రామచంద్రన్, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
అమరావతిలో అమిటీ యూనివర్సిటీ
Published Tue, Dec 29 2015 8:36 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement