నలిగిపోతున్న నాలుగో సింహం
సాక్షి, హైదరాబాద్: సిబ్బంది కొరత పోలీస్ శాఖకు పెనుసవాలుగా మారింది. ఇందుకు కారణం ఈ శాఖలో దాదాపు 8 వేల పోస్టులు ఖాళీగా ఉండిపోవడమే. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 500 మందికి ఒక పోలీసు ఉండాలి. అయితే రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా 1,050 మంది జనాభాకు ఒకరు మాత్రమే ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఖాళీలనూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోలేదు.
ఈ సమస్యపై పోలీస్ శాఖ ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా 55,128 పోస్టులున్న పోలీసు విభాగంలో 16 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. ఇవి కేవలం జిల్లాలు, అర్బన్ జిల్లాలు, కమిషనరేట్లతో పాటు రైల్వే పోలీసు విభాగాల్లో ఉన్న ఖాళీలు మాత్రమే. సిబ్బంది విభజన పూర్తికాని నేపథ్యంలో ఇంకా రాష్ట్ర స్థాయి పోస్టులైన నాన్-క్యాడర్, అదనపు ఎస్పీలతో పాటు డీఎస్పీ పోస్టులు, ప్రత్యేక విభాగమైన ఏపీఎస్పీలో ఖాళీలపై పూర్తి స్పష్టత రాలేదు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలీసు విభాగానికి ఒకేసారి 32 వేల పోస్టులు మంజూరు చెయ్యడం, వీటిలో కొన్ని రిక్రూట్‌మెంట్లు పూర్తయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సిబ్బంది లేమి ప్రభావం శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తుపై తీవ్రంగా పడుతోంది.
మహిళా పోలీసుల పరిస్థితీ ఇంతే..
మహిళా పోలీసుల విషయంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉండగా.. పోలీసు విభాగంలోని 20 యూనిట్లలోనూ కలిపి ఉన్న మహిళా పోస్టుల సంఖ్య మాత్రం 2,700 మాత్రమే. వీటిలోనూ అనేకం ఖాళీగానే ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అర్బన్ జిల్లా మినహా ఇతర జిల్లాల్లో మహిళా పోస్టుల సంఖ్య 200కు చేరట్లేదు.
రాష్ట్రంలోని ప్రతి పోలీసు విభాగంలోనూ సిబ్బంది కొరత ఇలానే ఉంది. దీనిని అధిగమించాలనే ఉద్దేశంతో రిటైర్డ్ పోలీసులనూ ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీవో)గా తీసుకుందామన్నా, హోంగార్డుల్ని రిక్రూట్ చేసుకుందామనుకున్నా ప్రభుత్వ అనుమతి లభించట్లేదు. ఈ కొరతకు తోడు కొత్తగా ఏర్పాటు చేసిన తుళ్లూరు, పోలవరం ముంపు మండలాల సబ్-డివిజన్లతో పాటు రాజధాని ప్రాంతంలోనూ అవసరమైన కొత్త పోస్టుల్ని లెక్కించాల్సి ఉంది. ఇదిలాఉండగా ప్రాథమికంగా 8,800 ఖాళీలు పూరించేందుకు అనుమతి కోరుతూ పోలీసు విభాగం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది.
వీక్లీ ఆఫ్.. అందని ద్రాక్ష!
మూడు షిప్టుల్లో పని చేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. వీక్లీ ఆఫ్ అనేది అందని ద్రాక్షగా మారిపోయింది. దీంతో పని భారం పెరిగి సిబ్బంది ఒత్తిడికి లోనవుతుండటంతో ఆ ప్రభావం ఆరోగ్యం పైనా పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి కీలక సందర్భం వచ్చినా బందోబస్తు కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.