ఏపీ హైవోల్టేజ్ | Andhra Pradesh: Opposition calls for bandh to protest denial of special status, demands CMs resignation | Sakshi
Sakshi News home page

ఏపీ హైవోల్టేజ్

Published Fri, Sep 9 2016 1:24 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

గురువారం అసెంబ్లీ సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్, చిత్రంలో పార్టీ ప్రజా ప్రతినిధులు - Sakshi

గురువారం అసెంబ్లీ సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్, చిత్రంలో పార్టీ ప్రజా ప్రతినిధులు

రేపు ఏపీ బంద్‌కు ప్రతిపక్షం పిలుపు
‘ఓటుకు కోట్లు’ కేసులో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినచంద్రబాబు రాజీనామాకు జగన్ డిమాండ్
జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు?
ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్న ఏపీ ప్రతిపక్ష నేత
బాబుపై భగ్గుమన్న ఏపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
బంద్‌కు పది వామపక్షాలు, కాంగ్రెస్ సంఘీభావం
వైఎస్సార్‌సీపీ ఆందోళనతో దద్దరిల్లిన అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ శాసన సభ నేటికి వాయిదా
మండలిలో ముఖ్యమంత్రి మొక్కుబడి ప్రకటన
ప్రజలకు వెన్నుపోటు, కేంద్రానికి లొంగుబాటు

 
 (సాక్షి, ప్రత్యేకప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా లేదని కేంద్రం స్పష్టం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు తందానా అంటూ తాళం వేయడం చూసి రాష్ర్టం భగ్గుమన్నది. అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రకటనకు ఐదుకోట్ల గుండెలు మండిపోయాయి. ఆ ప్రకటనను స్వాగతిస్తున్నానని చంద్రబాబు  చేసిన వ్యాఖ్యకు ఆంధ్రప్రజల రక్తం సలసలా మరిగిపోయింది. తప్పనిసరిగా అమలు చేయాల్సిన విభజన చట్టంలోని అంశాలను కేంద్ర మంత్రి వరసపెట్టి చదువుతుంటే టీవీల ముందు ఆశగా కూర్చున్నవారి ఆగ్రహం ఆకాశాన్నంటింది.
 
 ఏడు పేజీల జైట్లీ ప్రకటనపై చంద్రబాబు ఏడు సంతకాలు చేసి పంపించారని, ఆ తర్వాతే జైట్లీ దానిని చదివారన్న సంగతి కూడా బైటపడింది. దాంతో కేంద్రం, చంద్రబాబు కలిసే తమను దారుణంగా వంచించారని రాష్ర్టప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యింది. అందుకే గురువారం ఉదయం నుంచే రాష్ర్టవ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ ధర్నాలు, బైఠాయింపులు, ప్రదర్శనలు చేపట్టారు.

వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులు, శ్రేణులు కూడా ఈ కార్యక్రమాలలో భారీ స్థాయిలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా లేదని కేంద్రం మొండిచేయి చూపడం, దానిని స్వాగతిస్తున్నానంటూ చంద్రబాబు రాష్ర్టప్రజలకు వెన్నుపోటు పొడవడానికి నిరసనగా ఈనెల 10వ తేదీన రాష్ర్టబంద్ పాటించాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి ఐదుకోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని ఫణంగా పెట్టిన చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీతో కలసి బంద్ నిర్వహిస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. మరోవైపు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రత్యేక హోదాపై దద్దరిల్లిపోయాయి. ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు మెతకవైఖరి అనుసరిస్తుండడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనతో సభ స్తంభించింది.

రాష్ర్టంలో ప్రజల నిరసనాగ్రహాలు, బంద్ సన్నాహాలు చూసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరోమారు జైట్లీ ప్రకటనలోని అంశాలను వల్లెవేశారు. బాబుతో పలుమార్లు చర్చించి ఆయన ఒప్పుకున్నాకే ఈ ప్రకటన చేశామన్నారు. కాగా శాసనమండలిలో ప్రత్యేకహోదాపై ప్రకటన చేసిన బాబు కూడా విభజన చట్టంలోని అవే విషయాలను తిప్పితిప్పి చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
 
లొంగుబాటెందుకు బాబూ?: విభజన చట్టంలోని అంశాలనే అమలు చేస్తామని కేంద్రం చెబుతున్నా, ప్రత్యేక హోదాకు పాతరేస్తున్నా చంద్రబాబు వినమ్రంగా తలూపడం చూసి విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తప్పని సరిగా అమలు చేయాల్సిన విభజన చట్టంలోని అంశాలను తప్ప మరో కొత్త అంశం గురించి చెప్పకపోయినా చంద్రబాబు వెన్నెముకే లేనట్లు వంగిపోయి వంతపాడడం చూసి విస్తుపోతున్నారు.

సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పోటీగా బలమైన రాష్ట్రాలు తమకు కావలసిన నిధులను, కేంద్ర సంస్థలను సాధించుకుంటు న్న తరుణంలో విభజన చట్టం ప్రకారం మనకు న్యాయంగా రావలసిన వాటి కోసం రెండున్నరేళ్లు ఆగి కేంద్రంతో ఓ ప్రకటన చేయించుకుని సంతోషించడం, స్వాగతించడం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అవినీతి కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం వంటివి చంద్రబాబు కాళ్లూ చేతులు కట్టేశాయని, కేంద్రానికి పాదాక్రాంతం చేసేశాయని, అందుకే ఆయన ఐదు కోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని తాకట్టుపెట్టి కేసుల నుంచి తనను తాను కాపాడుకుంటున్నారని విమర్శకులంటున్నారు.
 
ఆర్థిక సంఘం అడ్డుపడగలదా?
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేక పోవడానికి 14వ ఆర్ధిక సంఘం సిఫారసులు అడ్డుపడడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ప్రకటించగా కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అసలు ఆర్థికసంఘం పని ఏమిటి? ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించాల్సిందెవరు? కేంద్ర రాష్ట్రాల మధ్య రెవెన్యూ పంపిణీ బాధ్యతలను ఆర్ధిక సంఘం చూస్తుంది.

ప్రత్యేక హోదాపై జాతీయాభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) నిర్ణయం తీసుకుంటుంది. ఎన్‌డీసీ చైర్మన్ ప్రధానమంత్రే. కేబినెట్ సహా అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థలన్నిటికీ ప్రధానమంత్రే చైర్మన్. అందువల్ల ప్రధానమంత్రి ఇవ్వదలుచుకుంటే అడ్డుకునేదెవరు? కానీ ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబునాయుడు ఒత్తిడి చేయకపోగా సాగిలపడడం వల్లే కేంద్రం ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ రకరకాల కారణాలు చెబుతున్నదని విశ్లేషకులంటున్నారు.
 
మరింత అవమానం...
ఏపీకి ఏమేమి ఇస్తున్నామో గురువారం వెబ్‌సైట్‌లో పెడతామని జైట్లీ ప్రకటించారు. కానీ ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో లేకపోగా సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నడిచే పీఐబీ సైట్‌లో జైట్లీ చెప్పిన అంశాలతో కూడిన ఓ మూడు పేజీల ప్రకటనను ఉంచారు. అందులో కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నామో.. ఎలా అమలు చేస్తామో వివరించారు.

అంతే తప్ప హోదాతో సమానమైన స్థాయిలో ఏపీకి ఇస్తున్న నిధుల గురించిన సమాచారమేమీ లేదు. హోదా ఇవ్వకపోగారాష్ర్టం విషయంలో ఇంత ఆషామాషీగా వ్యవహరించడం మరింత అవమానకరమని ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు  విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయాన్ని  ముట్టడించారు.  
 
 
 అట్టుడికిన అసెంబ్లీ.. అధికారపక్షం జిత్తులకు చెక్...
రోమ్ తగలబడిపోతుంటే ప్రశాంతంగా ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి మాదిరిగా..  చంద్రబాబు  శాసనసభ కార్యక్రమాలను యథాలాపంగా నడిపించేయాలని చూశా రు. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షను సమాధి చేసేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, అన్ని కార్యక్రమాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా చర్చించాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది.

సీఎం ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని అధికారపక్షం ప్రతిపాదించగా సభ్యులు చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షం కోరింది. ఎందుకంటే సీఎం ప్రకటన చేసిన తర్వాత మాట్లాడడానికి ఏముంటుంది అన్నట్లుగా ప్రతిపక్ష నాయకుడికి, సభ్యులకు మాట్లాడే అవకాశమే లేకుండా చేయాలనేది అధికారపక్షం ఎత్తుగడ.
 
పదేపదే మైక్ కట్ చేస్తూ.. మంత్రులకే అవకాశం ఇచ్చి ప్రతిపక్షంపై దాడి చేయిస్తూ పబ్బం గడుపుకోవాలనేది వారి వ్యూహం. గతంలో అనేక పర్యాయాలు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు అధికారపక్షం దిగజారడం రాష్ర్టప్రజలంతా చూశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. అయినా సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం ప్రకటన చేయడమే సాంప్రదాయమని, అయననే ముందుగా మాట్లాడడమంటే ఆ అంశాన్ని ముగించేసినట్లవుతుందని శాసనసభ వ్యవహారాల నిపుణులంటున్నారు.

అధికారపక్షం ఎత్తుగడను ప్రతిపక్షం సమర్ధంగా తిప్పికొట్టగలిగింది.  స్పీకర్ పదేపదే సభను వాయిదావేస్తూ చివరకు శుక్రవారం నాటికి సభను వాయిదా వేసేసి గట్టెక్కించడంతో అధికారపక్షం ఊపిరిపీల్చుకుంది. కానీ సీఎం మాత్రం శాసనమండలిలో ప్రత్యేక హోదాపై మొక్కుబడి ప్రకటన చేసేసి చేతులు దులుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement