శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌లో నిర్వహించిన ‘సాక్షి జనసభ’లో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు విన్నవించారు.
చందానగర్/సెంట్రల్ యూనివర్శిటీ, న్యూస్‌లైన్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌లో నిర్వహించిన ‘సాక్షి జనసభ’లో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు విన్నవించారు. బుధవారం చందానగర్ డివిజన్‌లోని అంబేద్కర్ కల్యాణ మండపంలో సాక్షి జనసభను ఫ్రెండ్స్ వె ల్ఫేర్ అసొసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. అసంపూర్తి డ్రైనేజీ పనులు, రోడ్లు, మంచినీటి సమస్యలను సమావేశం దృష్టికి తే వడంతోపాటు అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చే శారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ అశోక్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, వాటర్ వర్క్స్ మేనేజర్ సరిత, వార్డు కమిటీ సభ్యులు మహేష్‌యాదవ్, పలు కాలనీలకు చెందిన ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
చందానగర్ డివిజన్‌లో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. జనసభలో ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం చేపడుతన్న పనుల్లో ఎక్కడా ఆలస్యం చోటు చేసుకోవడం లేదు. త్వరిత గతిన పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం. అదనంగా సర్కిల్-12కు మరో ఏఈని నియమించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు. భూగర్భ డ్రైనేజీ పనులతో రోడ్లు ధ్వంసమయ్యాయి. వాటి మరమతులు చేపట్టే విషయాన్ని సీవరేజ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
- రాజ్‌కుమార్, సర్కిల్-11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
వినియోగదారులదే బాధ్యత
మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం తవ్విన పైప్‌లైన్ గుంతలను వినియోగదారులే పూడ్చివేయాలి. ఉన్నతాధికారుల ఆదేశానుసారం అన్ని కాలనీల్లో మంజీరా పైప్‌లైన్ పనులను వేగవంతం చేయనున్నాం. చందానగర్ డివిజన్‌లోని పలు కాలనీల్లో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నాం. జన సభ ద్వారా మా దృష్టికి వచ్చిన సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. జనసభలో వెల్లువెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. - సరిత, మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్
రూ. 2కోట్లతో చందానగర్ అభివృద్ధికి ప్రతిపాదనలు : కార్పొరేటర్ అశోక్‌గౌడ్
చందానగర్ డివిజన్ అభివృద్ధికి రూ. 2కోట్లతో ప్రతిపాదన చేసినట్లు కార్పొరేటర్ అశోక్‌గౌడ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సాక్షి దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జనసభ ద్వారా కొత్త సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.20లక్షలతో ఎంఏనగర్‌లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
పాత ముంబయి రోడ్డు నుంచి అమీన్‌పూర్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇంటి నంబర్లు రాని వారికి వెంటనే నెంబర్లు ఇచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పలు కాలనీల్లో వీధిలైట్ల ఏర్పాటు, పనిచేయని చోట మరమతులు చేపడతామన్నారు. మియాపూర్‌లోని బస్‌స్టేషన్ సమీపంలో త్వరలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినట్లు తెలిపారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా బోర్ల సంఖ్య పెంచడంతో పాటు అన్ని కాలనీలకు మంజీరా నీరు అందేలా కృషి చేస్తాం. చందానగర్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అధికారులు సమస్యల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ ప్రాంతవాసిగా ఇక్కడి సమస్యలు పరిష్కరించడం తన కర్తవ్యమన్నారు. జనసభల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్తున్న ‘సాక్షి’ కృషి మరువలేనిదన్నారు.