‘ప్రాణహిత’ ప్యాకేజీల అంచనాలు పైపైకి!
♦ 11, 12 ప్యాకేజీల్లో మార్పులతో భారీగా పెరగనున్న వ్యయం
♦ రూ.3,500 కోట్లు పెరగనున్న వ్యయం
♦ మరో 7 కి.మీ. పెరగనున్న టన్నెల్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు, రాజధాని నగర తాగు అవసరాలకు ఉద్దేశించిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు అంచనాలు పైపైకి ఎగబాకుతున్నాయి. రీ డిజైన్‌లో భాగంగా కొత్తగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపుతో నిర్మించే కొత్త బ్యారేజీలతోనే భారం రూ.10 వేల కోట్లకు పెరుగుతుండగా, ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్యాకేజీ 11 నుంచి 14 వరకు జరుగుతున్న మార్పులతో భారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు వ్యయం రూ.50 వేల కోట్లకు చేరుతుందని అంచనా ఉండగా, ఇవన్నీ తేలితే వాస్తవ వ్యయం ఎంత పెరుగుతుందనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
మారిన ప్రతిపాదనల మేరకు సామర్థ్యం పెంచిన రిజర్వాయర్లన్నీ ప్రాజెక్టు లింకు-4లో మిడ్‌మానేరు నుంచి పాలముపర్తి వరకు గల 11 నుంచి 14 ప్యాకేజీల్లో ఉన్నాయి. ఇందులో 11, 12 ప్యాకేజీల్లో చేయాల్సిన మార్పులు, పెరిగే వ్యయ భారంపై అంచనాలు సిద్ధంకాగా, 13, 14 ప్యాకేజీలపై ఇంకా తేల్చాల్సి ఉంది. ప్యాకేజీ 11ను మొత్తంగా రూ.2,500 కోట్లతో చేపట్టగా, ఇందులో భాగంగా ఉన్న ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీకి తగ్గించగా, తర్వాతి ప్యాకేజీలో ఉండే మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.5 నుంచి 50 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా కాల్వల డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 241 క్యూమెక్కుల నుంచి 301.25 క్యూమెక్కులకు పెంచాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇక్కడ 5 పంపులకు తోడు అదనంగా మరో పంపును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మొత్తానికి రూ.500 కోట్ల అదనపు వ్యయం అవుతుందని తేల్చారు. ఇక ప్యాకేజీ 12లో మల్లన్నసాగర్ సామర్థ్యం పెంచినందున ఇక్కడ కాల్వల డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 213 క్యూమెక్కుల నుంచి 329 క్యూమెక్కులకు పెంచగా, పంపులను 6 నుంచి 8కి పెంచారు. ఇక్కడ ఈ ప్యాకేజీల 9.18 కిలోమీటర్ల టన్నెల్ ఉండగా ఇప్పుడది మరో 7 కి.మీ. పెరిగి 16.18 కి.మీ.కి చేరింది. ప్రస్తుతం టన్నెల్, కాల్వల వెడల్పు, అదనపు పంపులకు కలిపి రూ.1,520 కోట్ల మేర వ్యయం పెరగనుండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి అదనంగా మరో రూ.1,500 కోట్ల అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా రెండు ప్యాకేజీల్లో కలిపి రూ.3,500 కోట్ల అదనపు వ్యయాన్ని ఇప్పటి వరకు లెక్కగట్టారు.