♦ సమయానికి రాకపోతే వేతనం లేని సెలవుగా పరిగణిస్తాం
♦ అధికారులు, ఉద్యోగులకు ఏపీ సర్కారు హెచ్చరిక
♦ అందరూ హాజరు పట్టికలో సంతకాలు చేయాల్సిందే
♦ సర్క్యులర్ మెమో జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సమయానికి విధులకు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వేళాపాళా లేకుండా ఉద్యోగాలకు రావడం, వెళ్లడం సాగుతోందని సాధారణ పరిపాలనశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో సమయానికి విధులకు రాని అధికారులు, ఉద్యోగులపై కొరడా ఝుళిపించాలని సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. సమయానికి కార్యాలయాలకు రాని ఉద్యోగులకు వేతనం లేని సెలవుగా పరిగణించేందుకు వెనుకాడమని హెచ్చరించారు. సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఉదయం 10:30కు రావాలని, సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలని నిబంధనలున్నప్పటికీ చాలామంది పాటించడం లేదని ఆ మెమోలో పేర్కొన్నారు.
10:30కి ముందే సంతకం చేయాలి
రోజూ ఉదయం 10:30 గంటలకన్నా ముందుగానే హాజరు పట్టికలో సంతకం చేయాలని సర్క్యులర్ మెమోలో పేర్కొన్నారు. గ్రేస్ పిరియడ్ కింద 10 నిమిషాలు ఇస్తామని, 10:40 గంటల తరువాత అధికారులు, ఉద్యోగులు ఎవరైనా విధులకు హాజరైతే అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి వారి సమక్షంలో హాజరు రిజిస్టర్‌లో సంతకం చేయాలని మెమోలో పేర్కొన్నారు. సంతకం చేసిన చోట అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి ఎర్రసిరాతో ‘ఎల్’ అనే హాజరు పట్టికలో రాయాలని పేర్కొన్నారు.
1:30 తర్వాత వస్తే సెలవే
అధికారులు, ఉద్యోగులెవరైనా 11:30 వరకు వరుసగా మూడ్రోజులు విధులకు రాకపోతే ఒకరోజు క్యాజువల్ సెలవు గా పరిగణిస్తామని, ఆ ఉద్యోగి క్యాజువల్ సెలవుల్లో ఒకటి కోల్పోవాల్సి వస్తుందని స్పష్టీకరించారు. ఆ ఉద్యోగి, అధికారికి క్యాజువల్ సెలవులు లేకపోతే ఒకరోజు వేతనంతో కూడిన సెలవులో కోత పెడతామన్నారు. క్యాజువల్, వేతనంతో కూడిన సెలవులు లేని పక్షంలో వేతనంలేని సెలవుగా పరిగణిస్తామన్నారు.
అధికారులు, ఉద్యోగులెవరైనా ఉదయం 11:30 తర్వాత మధ్యాహ్నం 1.30 గంటల ముందు విధులకు హాజరైతే సగంరోజు సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. 1:30 తర్వాత విధులకు హాజరైతే రోజు సెలవుగా పరిగణిస్తామన్నారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు ఈ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో హాజరు పట్టికలను తనిఖీ చేయాలని సూచించారు.