అమరావతిపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్షలో పలు నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: శాఖాధిపతుల కార్యాలయాలు, ఉద్యోగులు ఈ నెల 27వ తేదీ నుంచి నూతన రాజధానిలో పని చేయాల్సిందేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపునకు సంబంధించి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మార్గదర్శకాలతో కూడిన జీవో జారీ చేశారు. అంతకు ముందు సీఎస్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వెలగపూడిలో సచివాలయ నిర్మాణం పూర్తి అయిన వెంటనే సచివాలయ శాఖల తరలింపునకు ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయించారు.
ఆగస్టు నాటికి గానీ సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం లేనందున అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. తరలింపులో ఎదురయ్యే సమస్యలను అధిగమించి సాఫీగా సాగేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక, రహదారులు-భవనాలు, సాధారణ పరిపాలన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. తరలింపులో సహాయ సహకారాలను అందించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమచంద్రారెడ్డిని నియమించారు. సమస్యలు, అనుమానాల నివృత్తికి ఉద్యోగులు ప్రేమచంద్రారెడ్డిని సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
► ఫైళ్లను సమన్వయం.. భద్రతతో తరలించేందుకు పోలీసు శాఖ సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి. మార్చి 31 నాటికి కాలం చెల్లిన ఫైళ్లను సంబంధిత అధికారుల అనుమతి తీసుకుని కాల్చివేయాలి.
► శాఖాధిపతుల కార్యాలయాలకు విజయవాడ, గుంటూరుల్లో చదరపు అడుగుకు రూ. 20 చొప్పున అద్దెకు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రతీ ఫైలు ఆర్థిక శాఖకు పంపించాల్సిన అవసరం లేదు. శాఖాధిపతులే నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేక కేసుల్లో చ.అడుగుకు రూ.30 మించకుండా అద్దెకు తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి నూతన రాజధానికి ఉద్యోగులు తరలివెళ్లడం బదిలీ కింద కు రాదు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేయాలి. హైదరాబాద్ నుంచి నూతన రాజధానికి వెళ్లి పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఐదు రోజుల పనిదినాలు వర్తిస్తాయి. ఉద్యోగుల పిల్లలకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కల్పించేందుకు విజయవాడ, గుంటూరుల్లో విద్యాశాఖలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.
► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉద్యోగులకు నివాస భవనాలు సమకూర్చడం, భద్రత కల్పించడం, వర్కింగ్ మెన్ హాస్టళ్ల తరహా ఏర్పాట్ల కోసం ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. మహిళా ఉద్యోగులకు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు సమకూర్చడం, భద్రత కల్పించడం, రవాణా ఏర్పాటు చేయడానికి కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.
► నూతన రాజధానిలో నివాస గృహాల నుంచి కార్యాలయాలకు, కార్యాలయాల నుంచి నివాసాలకు వెళ్లేందుకు వీలుగా ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. రాయితీ బస్సు పాస్‌లు ఇవ్వాలి. ఉద్యోగులు, వారి కుటుంబాలకు తగు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేయాలి. ఉద్యోగులు, వారి కుటుంబాలకు రాజధాని ప్రాంతంలో స్థానికత కల్పించేందుకు లోకల్ కేండెట్ సర్టిఫికెట్‌ల జారీ కోసం సాధారణ పరిపాలన శాఖ తగిన ఉత్తర్వులు జారీ చేయాలి.
27 నుంచి అక్కడ పని చేయాల్సిందే
Published Tue, Jun 14 2016 1:24 AM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM
Advertisement