అక్కడకు బ్రహ్మచారులుగానే వెళతాం
► రాజధానికొచ్చే ఉద్యోగుల్లో 70% బలవంతపు బ్రహ్మచారులే!
► ఇప్పటికే 65 శాతం మంది ఆప్షన్లు
► ఇంకా పెరుగుతుందంటున్న అధికార వర్గాలు
► తక్షణం కుటుంబాల తరలింపునకు విముఖత
► పిల్లల చదువులు, ఇతరత్రా ఇబ్బందులే కారణం..
► ప్రస్తుతానికి ఒంటరిగానే వెళ్లి విధులు నిర్వర్తించాలని అత్యధికుల నిర్ణయం
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల్లో అత్యధికులు ఒంటరిగానే అక్కడికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో గుంటూరు జిల్లా వెలగపూడిలో రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని బలవంతపు బ్రహ్మచారుల నిలయంగా మారనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల్ని వచ్చే జూన్ 15 నాటికల్లా తాత్కాలిక రాజధానికి తరలివెళ్లాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలివెళ్లేందుకు ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు.
అయితే పిల్లల చదువులు, ఇతరత్రా కారణాల దృష్ట్యా కుటుంబాలతోసహా తరలివెళ్లడానికి ఇష్టపడట్లేదు. తమ కుటుంబాల్ని హైదరాబాద్‌లోనే ఉంచి తాము ఒంటరిగానే తాత్కాలిక రాజధానికి వెళ్లి విధులు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రభుత్వానికి తెలియపరిచారు. విభాగాధిపతుల కార్యాలయాలు, సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 65 శాతం మంది ఒంటరిగానే వెళతామని ఆప్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం 35 శాతం మంది మాత్రమే కుటుంబాలతోసహా వెళతామని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ ఏపీ సచివాలయంలో ఎక్కడ నలుగురు ఉద్యోగులు కలసినా ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. ‘నువ్వూ బలవంతపు బ్రహ్మచారివేనా...’ అని పరస్పరం ఉద్యోగులు ప్రశ్నించుకుంటున్నారు.
ఎందుకంటే..
చదువుకుంటున్న పిల్లలున్న ఉద్యోగుల్లో అత్యధికులు ఈ విద్యాసంవత్సరానికి తమ బిడ్డల్ని హైదరాబాద్‌లోనే చదివించాలని నిర్ణయించుకున్నారు. తాత్కాలిక రాజధానికి జూన్15 నాటికి తరలివెళ్లాలని ప్రభుత్వం పేర్కొనగా.. అంతకుముందుగానే విద్యాసంవత్సరం ఆరంభమవుతుండడంతో వారీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కుటుంబాల్ని హైదరాబాద్‌లోనే ఉంచి తాము ఒంటరిగా తాత్కాలిక రాజధానికెళ్లి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు.
జూన్, జూలై, ఆగస్టులో ప్రభుత్వం ఎప్పుడు చెబితే అప్పుడు తాము ఒంటరిగా వెళ్లి విధులు నిర్వర్తిస్తూ వారం వారం హైదరాబాద్‌కు వస్తుంటామని వారంటున్నారు. ఈ కారణంవల్లే బ్యాచిలర్స్ కింద ఆప్షన్ ఇచ్చామని పలువురు ఉద్యోగులు ‘సాక్షి’కి తెలిపారు. బ్యాచిలర్స్‌గా వెళ్లేవారికి ప్రభుత్వమే అక్కడ వసతి సదుపాయం కల్పించాలని ఉద్యోగసంఘాల నేతలు ఇప్పటికే కోరారు. అందువల్ల ప్రభుత్వం వసతి కల్పిస్తుందనే ఉద్దేశంతోనే 65 శాతం మంది ఒంటరిగానే వెళతామని ఆప్షన్‌లో పేర్కొన్నారు. ‘ఇప్పటికే 65 శాతం మందిదాకా బలవంతపు బ్రహ్మచారులుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు జరిగేనాటికి ఈ సంఖ్య 70 నుంచి 75 శాతానికి పెరిగే వీలుంది’ అని ఓ ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యానించారు.
మొత్తం ఎంతమంది?
హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి వెళ్లాల్సిన ఉద్యోగుల సంఖ్య సుమారు 9,500 వరకూ ఉంటుందని అంచనా. ఇందులో విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్నవారు 7,500 మంది, సచివాలయంలో పనిచేస్తున్నవారు 2,000 మంది ఉంటారని భావన. వీరిలో రెండు మూడేళ్లలో రిటైరయ్యేవారిలో అత్యధికులు కుటుంబాలను తీసుకెళ్లకుండా తాము మాత్రమే వెళ్లి ఉద్యోగ జీవితాన్ని ఎలాగోలా పూర్తి చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో సొంత ఇళ్లున్న ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి కుటుంబాల్ని ఇక్కడే ఉంచి ఒంటరిగానే వెళ్లి, వచ్చే ఏడాది పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. మొత్తమ్మీద తాత్కాలిక రాజధానిలోని ఉద్యోగుల్లో ఎక్కువమంది బలవంతపు బ్రహ్మచారులే ఉంటారని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.