కుటుంబాలతో వెళ్లేదెవరో?
ఏపీ రాజధానికి వెళ్లాల్సిన ఉద్యోగుల విషయంలో సర్కారు సందేహాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి హైదరాబాద్ నుంచి కుటుంబాలతో సహా తరలి వెళ్లే ఉద్యోగులు ఎంతమంది ఉంటారో లెక్క తేల్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల నుంచి లిఖిత పూర్వకంగా పత్రాలను తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే ఏపీ రాజధానికి వెళ్లే వారి పిల్లలు ఎక్కడ ఎంత వరకు చదివారో వివరాలు సేకరించనుంది.
ఇదే సమయంలో తమ పిల్లలకు నూతన రాజధానిలో స్థానికత కల్పించాలని కోరుతున్న ఉద్యోగుల్లో కూడా ఎంతమంది కుటుంబాలతో తరలి వెళ్తారో లెక్కించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన రాజధాని అమరావతికి తరలి వెళ్లాల్సిన రాష్ట్ర స్థాయి ఉద్యోగులు 25 వేలమంది వరకు ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఎక్కువమంది ఉద్యోగులు కుటుంబాలతో సహావెళ్లే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ముఖ్యంగా రెండు మూడేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు కుటుంబాలతో వెళ్లకపోవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించి లెక్కలు తేల్చేందుకు ప్రత్యేకంగా నమూ నా పత్రం రూపొందించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. నమూనా పత్రంలో ఏ ఏ అంశాలు ఉండాలో ఏపీ సీఎస్ సమీక్షించారు. ఉద్యోగులు నమూనా పత్రాన్ని పూరిస్తే ఎంతమంది ఉద్యోగుల పిల్లలకు స్థానికత సమస్య ఏర్పడుతుంది, ఎంతమంది ఉద్యోగులు కుటుంబాలతో సహా రాజధానికి తరలి వెళ్తారనే లెక్క తేలుతుందని ఏపీ సీఎస్ చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
భారీగా అద్దెల చెల్లింపుపై విమర్శలు
సాధారణ పరిపాలన శాఖలోని ప్రొటోకాల్, కేబినెట్ విభాగాలను వెంటనే విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) చెందిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, నలుగురు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇద్దరు డీఈవోలను ఈ నెల 24వ తేదీలోగా విజయవాడ వెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. వీరి కోసం విజయవాడలో భారీగా అద్దె చెల్లిస్తూ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రెండు అద్దెకు తీసుకున్నారు. 1,200 చదరపు అడుగుల్లో గల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కు నెలకు రూ. 30 వేలు. 1,500 చదరపు అడుగుల్లో గల ఫ్లాట్‌కు నెలకు రూ. 40 వేలు అద్దె చెల్లించనున్నారు.
ప్రైవేట్ భవనాలకు ఇంత భారీ మొత్తంలో అద్దెలు చెల్లించడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేట్ భవనాలు అద్దెకు తీసుకోవాలంటే చదరపు అడుగుకు నెలకు రూ. 10 మాత్రమే అద్దె చెల్లించాలనే నిబంధన ఉంది. అదే గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చదరపు అడగుకు నెలకు రూ. ఏడు మాత్రమే అద్దె చెల్లించాలనే నిబంధన ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,200 చదరపు అడుగులకు నెలకు రూ. 30 వేల అద్దె అంటే చదరపు అడుగుకు ఏకంగా రూ. 25 చెల్లిస్తోందన్నమాట.