ఏపీఎస్‌ఆర్టీసీకి హైదరాబాద్‌లో లీజు స్థలాలు!!
హైదరాబాద్: ఏపీఎస్‌ఆర్టీసీ లీజు ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రైవేటు స్థలాలు తీసుకోవాలని యోచిస్తోంది. మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్‌లలో స్థలాలు తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
తెలంగాణ ఆర్టీసీతో సంప్రదించి ఇరు రాష్ట్రాల నడుమ స్థలాల్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అధికారులు ప్రతిపాదించారు. హైదరాబాద్‌లో ఏపీఎస్‌ఆర్టీసీకి స్థలాలిస్తే, తెలంగాణ ఆర్టీసీకి ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరులో ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు నివేదిక సమర్పించారు. అయితే లీజు విధానంలో ముందుగా స్థలాలు గుర్తించి తీసుకుందామని మంత్రి శిద్ధా ఆదేశాలివ్వడంతో ఆ దిశగా ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని నగరాలు, పట్టణాలకు ప్రయాణికులను చేరవేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రైవేటు బస్సుల మాదిరిగానే ఆర్టీసీ కూడా ప్రయాణీకుల్ని రోడ్లపైనే ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరుస్తోంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ 23 బోర్డింగ్ పాయింట్లున్నాయి. ఎక్కడా కూడా ప్రయాణీకులు కూర్చొనేందుకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. ముఖ్యంగా మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ సీజన్లలో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కనీసం రెండు చోట్ల స్థలాలు సేకరించి చిన్నపాటి డిపోలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పుడు లీజు విధానంలో 33 ఏళ్ల పాటు స్థలాలు లీజుకు తీసుకుని ప్రయాణీకులకు కనీస సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ భావిస్తోంది.