బంద్‌కు ఏపీయూడబ్ల్యూజే మద్దతు
Published Thu, Sep 8 2016 8:44 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని జర్నలిస్టులు కూడా సమైక్యంగా ఉద్యమించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) యూనియన్‌లు పిలుపునిచ్చాయి.
ఆ మేరకు ఈ నెల10వ తేదిన జరుగుతున్న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని వారు అభిప్రాయపడ్డారు. ప్యాకేజీ పేరుతో సాయం చేయడంలో తప్పులేదని అయితే రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం 10వ తేదీన జరిగే రాష్ట్ర బంద్‌లో జర్నలిస్టులు విరివిగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
Advertisement