ఉక్కు కోసం ఉద్యమిద్దాం
సాక్షి, కడప కార్పొరేషన్ : కడప ఉక్కు పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని, పార్లమెంటులో చేసిన చట్టమని, హక్కుదారులు కావాలంటే ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని అఖిపక్షనేతలు పిలుపునిచ్చారు. కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలని వైఎస్ఆర్ కలలు కనేవారన్నారు. ఈ మేరకే ఆయన హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. బ్రాహ్మణి యాజమాన్యం రూ.1800కోట్లు ఖర్చు చేసి పరిశ్రమ ఏర్పాటు చేసిందని, రూ.1200కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తవుతుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.
ఉక్కు పరిశ్రమను విభజన చట్టంలో పొందుపరిచారని, పరిశ్రమ స్థాపనకు కావలసిన ఎయిర్‌పోర్టు, రైల్వే, విద్యుత్, నీరు, వనరులు వంటి అన్ని అనుకూలతలు ఇక్కడ ఉన్నా అది రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీయేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు కలిసి పోరాడుదామంటే ముందుకు రాని టీడీపీకి ఈరోజు ప్రతిపక్షాలు కనిపించాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి లక్షల కోట్లు పచ్చచొక్కాల వారికి పంచేసి పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు, ఉక్కు పరిశ్రమ వల్లే విశాఖపట్నం అంతపెద్ద నగరంగా అభివృద్ధి చెంది, 42 శాతం ఆదాయాన్నిస్తోందన్నారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే అదే తరహాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందరూ ఐక్యంగా సైనికుల వలే పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సభ్యుడు బండి జకరయ్య మాట్లాడుతూ జెండాలు పక్కనబెట్టి ఉక్కు పరిశ్రమే ఏకైక ఎజెండాగా పోరాడాలన్నారు. నాలుగేళ్లు ఉక్కు పరిశ్రమపై పట్టించుకోని టీడీపీ ఈనాడు అఖిలపక్షాన్ని పిలవడం సిగ్గుచేటన్నారు.
బీఎస్పీ నాయకులు గుర్రప్ప మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాడాలని సూచించారు. జనసేన నాయకులు చలపతి మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఇన్నాళ్లు చేసిన పోరాటం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యిందన్నారు. లీగల్ సెల్ అథారిటీ కన్వీనర్ గుర్రప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ దూరదృష్టితో ఉక్కు పరిశ్రమ స్థాపించారని, రెండు పత్రికలు మాత్రం బ్రాహ్మణి మూతపడే వరకూ విశ్రమించకుండా కథనాలు రాశాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ జల్లికట్టు, తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలని చెప్పారు. మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకోసం ప్రాణ త్యాగానికైనా, అరెస్టులు కావడానికైనా, జైలుకెళ్లడానికైనా సిద్దమేనని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఐఎన్ సుబ్బమ్మ, స్టీల్‌ప్లాంటు సాధన సమితి నాయకులు సీఆర్వీ ప్రసాద్, రైతు స్వరాజ్య వేదిక శివారెడ్డి, కిషోర్ కుమార్, చల్లా రాజశేఖర్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, టి. సునీల్, విజయ్‌కుమార్, ఖాజా, షఫీ, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని..
బీజేపీ కళ్లున్న కబోదిలా వ్యవహరించింది. నాలుగేళ్లు కమిటీల పేరుతో కాలయాపన చేసి ఈనాడు సాధ్యం కాదని చెప్పడం దారుణం. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావలసినంత భూమి, నీరు, రైల్వేలైన్, ఎయిర్‌పోర్టు, ముడిసరుకు ఉందని.. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి తయారైంది. ఉక్కు పరిశ్రమ సాధనకు చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పూర్తి సహకారం ఇస్తుంది. – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు
ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్లు్యజే మద్దతు...
కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్లు్యజే) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. విభజనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమను ఇన్నాళ్లు ఇస్తాం, ఇస్తాం అని ఊరించిన కేంద్రం ఒక్కసారిగా సాధ్యం కాదని చెప్పడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ఎస్ రెడ్డి, జయపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి..
ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి. అందుకోసం విస్తృత ప్రచారం చేయాలి. ద్రోహం చేసిన వారు, ఆ ద్రోహానికి సహకరించిన వారు కూడా దోషులే. అన్యాయం చేసేవారితో చేతులు కలపొద్దని, ద్రోహులను ఏకాకిని చేసి ఉక్కు పరిశ్రమ ఒక్కటే ఏకైక ఎజెండాగా పోరాడాలి. అమరావతికి భూమిపూజ చేసేటప్పుడు మట్టి, నీళ్లు తెచ్చి మొఖాన కొట్టిన మోడీ, ఈనాడు రాయలసీమ ఆశలపై నీళ్లు చల్లారు.
– ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి