
కాపులు ఏమైనా టెర్రరిస్టులా: మాజీ డీజీపీ
ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతున్న కాపులు ఏమైనా టెర్రరిస్టులా అని మాజీ డీజీపీ ఎంవీ భాస్కరరావు అన్నారు.
కాపుల ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తగదని మాజీ డీజీపీ ఎంవీ భాస్కరరావు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతున్న కాపులు ఏమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని కవర్ చేస్తున్న సాక్షి చానల్‌ను నియంత్రించడం సరికాదని, ఇది మీడియా గొంతును నొక్కేయడమే అవుతుందని భాస్కరరావు తెలిపారు.
కాపులు కొత్తగా హామీలు ఇవ్వాలని ఏమీ అడగడం లేదని, ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి మూడు నెలల సమయం సరిపోతుందని, అంతే తప్ప అరెస్టులు ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆయన చెప్పారు.