హోదా ఇవ్వాల్సిందే
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా హామీలను నెరవేర్చాల్సిందే.. రాజ్యసభలో ఏపీకి అన్ని పార్టీల మద్దతు
♦ నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని అమలుచేయాలి
♦ ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు-స్థితిగతులు’పై
♦ రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో పార్టీల డిమాండ్
♦ హోదాతోనే అన్నీ పరిష్కారం కావన్న వెంకయ్యనాయుడు
♦ ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని సభలో ప్రస్తావించిన వైఎస్సార్‌సీపీ
♦ కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సీఎం చంద్రబాబు మొహమాట పడుతున్నారని కాంగ్రెస్ విమర్శలు
♦ హామీలు అమలు చేస్తారా.. లేదా? చెప్పాలన్న ఏచూరి
♦ బిల్లులో అంశాలు, సభ హామీలు అమలు కావాలన్న కేకే
♦ విపక్షాలపై టీడీపీ విమర్శలు.. కేంద్రాన్ని నిలదీసేందుకు జంకు
♦ నేడూ కొనసాగనున్న చర్చ.. సమాధానం ఇవ్వనున్న జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్ని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం అమలు-స్థితిగతులు’ అన్న అంశంపై గురువారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అన్ని పార్టీలు ఏపీకి అండగా నిలిచాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, బీజేడీ, జేడీయూ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ తదితర అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.
అయితే, చర్చలో బీజేపీ ఒంటరి అయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... హోదాతోనే అన్ని సమస్యలు పరి ష్కారం కావని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో ప్రస్తావించారు. ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లు అనడం సహేతుకం కాదన్నారు. ఏపీ సీఎం ప్రత్యేక హోదా సంజీవని కాదం టూ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక టీడీపీ సభ్యులు తమ ప్రసంగాల్లో విపక్షాలను విమర్శించడమే తప్ప ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు.
రాజ్యసభలో ప్రత్యేక హోదా పై జరిగిన స్వల్పకాలిక చర్చ శుక్రవారం కూడా కొనసాగనుంది. గురువారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 వరకు జరిగిన చర్చలో పలు పార్టీల నేతలు, కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడారు. చర్చలో మరో ముగ్గురు సభ్యులు మాట్లాడాల్సి ఉంది. చివరగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు.
వెంకయ్య వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి అభ్యంతరం
రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయని వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో పేర్కొనడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ లేచి ‘‘2012 డిసెంబరు 28న అఖిల పక్ష సమావేశానికి ముందు వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు రాశారు’’ అంటూ లేఖ చదివి వినిపించారు. దీనికి విజయసాయిరెడ్డి బదులిస్తూ... ‘‘మేం సపోర్ట్ చేయలేదు. లేఖ సారాంశం చూడండి’’ అని అన్నారు.
ఆగస్టు 5న సభలోకి ప్రైవేట్ బిల్లు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆగస్టు 5న వస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఈ బిల్లుపై ఓటింగ్ అంశాన్ని ప్రస్తావించినప్పుడు... ‘‘రాజ్యాంగం ప్రకారం నడుచుకుం టాం. బిల్లు పాసవుతుందా? లేదా? అనే అంశాన్ని నేనెలా చెప్పగలను’’ అని కురియన్ పేర్కొన్నారు.
స్వల్పకాలిక చర్చలో ఎవరేమన్నారంటే..
ప్రత్యేక హోదాతోనే అన్నీ పరిష్కారం కావు
‘‘అప్పట్లో సీమాంధ్రకు ఎలాంటి రక్షణలు లేకుండా రాష్ట్ర విభజన జరుగుతోందన్న వేదనలో మేం కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపాం. మేం విభజన బిల్లుకు మద్దతిస్తాం, కానీ కొన్ని రక్షణలు కావాలని అడిగాం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాంక్షించి మేం సలహాలిచ్చాం. కానీ అవి బిల్లులో రాలేదు. ఆ రోజు బిల్లు పాసయిన తరువాత మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగాయి. అందుకే బిల్లులో పెట్టి ఉండాల్సిందని అడిగాం. హోదాను బిల్లులో చేర్చితే మళ్లీ లోక్‌సభకు వెళ్లాల్సి వస్తుందన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఏపీకి న్యాయం చేయాలన్న తలంపుతో పనిచేశాం. రాష్ట్రంలో అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర అవసరాలను బట్టి అన్నిరకాలుగా సాయం అందిస్తూనే ఉన్నాం. రెవెన్యూ లోటు అంశాన్ని పరిష్కరించాల్సి ఉంది. చట్టంలో ఇచ్చిన అన్ని హామీలు అమలవుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాయం చేస్తుంది. కానీ, అన్నింటికీ అదే పరి ష్కారం కాదు. చట్టంలో ఉన్నవన్నీ నెరవేరుస్తాం. ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇంత సాయం చేయలేదు’’
- వెంకయ్య నాయుడు, కేంద్ర సమాచార శాఖ మంత్రి
హామీ అమలుపై గడువు చెప్పండి
‘‘ఏపీకి ఇచ్చిన హామీని సర్కారు నిలబెట్టుకుంటుందని రెండేళ్లుగా చూశాం. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు తీరా ఓటింగ్‌కు వచ్చేసరికి ద్రవ్య బిల్లు అన్నారు. చివరకు స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక హోదా యూపీకి, బిహార్‌కు, ఒడిశాకు ఇవ్వాలి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలతో పోల్చరాదు. హామీని ఎప్పటిలోగా అమలు చేస్తారో గడువు కూడా చెప్పండి’’
- గులాం నబీ ఆజాద్, ప్రతిపక్ష నేత
ఆ హామీలు ఏమయ్యాయి?
‘‘చట్టంలోనిహామీలు, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. విభజన చట్టంలోని సెక్షన్ 93, 94(2), సెక్షన్84, 85, 90, 94ల అమలు ఏమైంది? సెక్షన్ 46, 46(2) అమలు ఏమైంది? మన్మోహన్‌సింగ్ ఆరు హామీలు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? రెవెన్యూ లోటు ఏమైంది?’’
- జైరాం రమేశ్(కాంగ్రెస్)
చంద్రబాబుకు మొహమాటమెందుకు?
‘‘ఏపీకి ప్రత్యేక హోదా అంశం భావోద్వేగాలతో కూడి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడేందుకు మొహమాటపడుతున్నారు. ఎందుకు ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవడం లేదు? చట్టంలోని హామీలను అమలు చేయాలని ఎందుకు అడగడం లేదు? ప్రధాని ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి చేయకపోవడానికి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? లేక రాజకీయ అనుకూలత కోసమా?’’
- దిగ్విజయ్‌సింగ్(కాంగ్రెస్)
ఎప్పుడు చేస్తారో చెప్పండి
‘‘రెండు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు పరుస్తారా? లేదా?ఎప్పుడు చేస్తారో చెప్పండి. ఇక్కడే ప్రకటించండి. లేదంటే రెండు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు తలెత్తుతాయి. నిర్ధిష్టంగా ఏవిధంగా అమలుపరుస్తారో ఒక ప్రణాళిక ప్రకటించండి. యూపీ, బెంగాల్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను కూడా పట్టించుకోవాలి’’
- సీతారాం ఏచూరి(సీపీఎం)
‘హోదా’ వ్యాధిలా మారింది
‘‘ఏపీకి ఆదాయ వనరులు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక హోదా ఒక వ్యాధిలా మారింది. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’’
- సీఎం రమేశ్(టీడీపీ)
ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకోను
‘‘నా వల్లే ఈ చర్చ వచ్చింది. ఈ చర్చకు అనుమతిస్తే నేను ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకుంటాని అన్నట్లు ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోను. ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే ఇప్పుడు విలువ లేకుండా పోయింది. లోపాలు, సాకులు వెతక్కండి. ప్రత్యేక హోదాను పదేళ్ల పాటు అమలు చేయండి. మా హక్కులను కాపాడండి’’
- కేవీపీ రామచంద్రరావు(కాంగ్రెస్)
ప్రధాని చెప్పింది అమలు చేయాలి
‘‘ప్రధాన మంత్రి చెప్పిన మాట అమలవ్వాలి. ప్రధాన మంత్రిగా మన్మోహన్‌సింగ్ ఉన్నా, మోదీ ఉన్నా.. వారు చెప్పింది అమలు కావాలి. లేదంటే ఇదొక చెడు సంప్రదాయం అవుతుంది. యూపీ, బీహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’
- నరేష్ అగర్వాల్(సమాజ్‌వాదీ పార్టీ)
హామీలను అమలు చేయాలి
‘‘ఈ రోజు ఒక పార్టీ అధికారంలో ఉంటే, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావొచ్చు. ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయా లి. మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను మీరు(బీజేపీ) నెరవేర్చాలి. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి’’
- డి.రాజా(సీపీఐ)
పోలవరం ప్రాజెక్టును ఆపాలి
‘‘ఆంధ్రప్రదేశ్ విభజనను కేంద్రం సరిగ్గా డీల్ చేయలేదు. బీజేడీకి ఆంధ్రప్రదేశ్‌పై సానుభూతి ఉంది. ప్రత్యేక హోదాను పొందేందుకు ఒడిశాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అలాగే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకూడదు. దానిని వెంటనే ఆపాలి’’
- అనుభవ్ మొహంతీ(బిజూ జనతాదళ్-ఒడిశా)
ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
‘‘సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రధాన మంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం సత్సంప్రదాయం. అయితే యూపీ, ఇతర రాష్ట్రాల ఆర్థిక స్థితి ఏంటి? దానిపై కూడా దృష్టిపెట్టాలి’’
- సుఖేందు శేఖర్ రాయ్(తృణమూల్ కాంగ్రెస్)
ఇతర రాష్ట్రాలనూ పట్టించుకోవాలి
‘‘సర్కారు మారినా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చి న హామీలన్నీ నెరవేర్చాలి. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అలాగే వెనకబడిన రాష్ట్రాలను కూడా పట్టించుకోవాలి. బిహార్‌కు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయి’’
- అలీ అన్వర్ అన్సారీ(జేడీయూ)
తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడలేదు
‘‘ఇక్కడ ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడారా? చట్టం రెండు రాష్ట్రాలకు చెందిన అంశమైనా తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ మిత్రులు అడిగిన ప్రతి అంశానికి నా మద్దతు ఉంది. బిల్లులో ఉన్న అంశంగానీ, లేక సభలో ఇచ్చిన హామీలు కానీ అమలవ్వాలి’’
- కె.కేశవరావు(టీఆర్‌ఎస్)
సాకులు వెతకొద్దు
‘‘ఆనాడు అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు విభజనకు మద్దతు ఇచ్చారు. ఈ రోజు హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. కేబీకే-బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఎందుకు ఇవ్వడంలేదు. హోదా ఎందుకు ఇవ్వడం లేదు? సాకులు వెతకొద్దు’’
- టి.సుబ్బరామిరెడ్డి(కాంగ్రెస్)
టీడీపీ, బీజేపీ విడిపోవాలని చూస్తున్నారు
‘‘టీడీపీ, బీజేపీ కలిసి 2014 ఎన్నికల్లో పోటీచేశాయి. అన్నదమ్ములా కలిసి పోటీ చేశాం. మా ఇద్దరిని విడగొట్టాలనే భావన కాంగ్రెస్‌కు ఉన్నట్టు మాకు అనుమానం వస్తోంది. కానీ అలా జరగదు. మేం కలిసే పోరాడుతాం. బిల్లులో పెట్టిన అంశంపై పోరాటం చేస్తాం. మా ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదు’’
- గరికపాటి రామ్మోహన్‌రావు(టీడీపీ)
మేం అడుక్కుంటున్నామా?
‘‘మేమేమన్నా అడుక్కుంటున్నామా? రాజకీయ ప్రయోజనమా? లేక ప్రాంతీయ ద్వేషమా? తెలుగువాళ్లే కదా! ఏమవుతుందిలే అని తక్కువగా అంచనా వేయకండి. ఐదు కోట్ల ఆంధ్రుల పట్టుదల చూడండి. మంచితనం బలహీనత కాదని గ్రహిస్తారు మీరు. ద్రవ్య బిల్లు అని సాకులు చెబుతూ తప్పుకోవాలని చూస్తున్నారా?’’
- రేణుకా చౌదరి(కాంగ్రెస్)
హామీలను నెరవేర్చాలి
‘‘ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. చిన్న రాష్ట్రాలే అభివృద్ధికి హేతువులని బీఎస్పీ నమ్ముతోంది. ఉత్తరప్రదేశ్‌ను కూడా విభజించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా అమలు చేయాలి’’
- వీర్‌సింగ్(బీఎస్పీ)