
పీజేఆర్ కొడుకుని.. నాకూ పౌరుషం ఉంది!
''నేను హైదరాబాద్ వాడిని.. పీజేఆర్ కొడుకుని.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులున్నాయి. మాక్కూడా పౌరుషం ఉంటుంది. గొడవ పడాలంటే చెప్పండి... మైదానంలో గొడవపడదాం'' అని జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు, మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో జరిగిన ఘర్షణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీచంద్ రెడ్డికి తమవైపు నుంచి ఆహ్వాన పత్రిక వెళ్లలేదని, మరి ఎవరివైపు నుంచి వెళ్లిందో తనకు తెలియదని విష్ణు అన్నారు.
తన బావమరిది పెళ్లి జరుగుతుండగా విష్ణు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, మెడమీద రెండు దెబ్బలు కొట్టారని, తాను ఏంటని అడిగేలోపే వాళ్ల గన్ మన్ వచ్చి తుపాకి బయటకు తీశాడని అన్నారు. తనను బెదిరించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. వంశీ చంద్ రెడ్డి అసలు తనతో ఎందుకు గొడవపడ్డారో తెలీదని, మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఎందుకు గొడవ పెట్టుకున్నారో తెలియదని అన్నారు. బావమరిది పెళ్లిలో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తమకూ పౌరుషం ఉంటుందని, గొడవ పడాలంటే మైదానంలో పడదామని అన్నారు. ఆయనా పోలీసులకు ఫిర్యాదుచేశారు, తాను కూడా చేశానని విష్ణు చెప్పారు.