నా చేతి వేళ్లు విరిచి.. దాడి చేశారు: వంశీచంద్ రెడ్డి
విష్ణువర్ధన్ రెడ్డి తనను పిలిచి, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతివేళ్లు విరిచేశారని, దాదాపు 30-40 మంది వచ్చి తనపై దాడి చేశారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. విష్ణు ప్రవర్తన, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు రవీందర్ రెడ్డి, ఆయన కొడుకు సుమధుర్ రెడ్డిలపై జరిగిన సంఘటన అందర చూశామని, అవన్నీ వాస్తవాలేనని అన్నారు.
శుక్రవారం నాడు తాను పెళ్లి కూతురి తరఫు ఆహ్వానంతో పెళ్లికి వెళ్తుంటే ఆయనే తనను పేరుపెట్టి పిలిచారని, దాంతో తాను సంస్కారంతో చెయ్యిచ్చి విష్ చేశానని.. కానీ అతడు తన వేళ్లను విరగ్గొట్టే ప్రయత్నం చేశాడని వంశీ ఆరోపించారు. రెండు సెకన్ల తర్వాత తనకు విషయం తెలిసి చెయ్యి లాక్కునే ప్రయత్నం చేశానని, అంతలోనే సడన్గా దాడి చేశారని అన్నారు. తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని, తనకు సైట్ ఉంది కాబట్టి ఏం జరిగిందో కూడా తెలియలేదని, అంతా బ్లర్ అయిపోయిందని వంశీ చెప్పారు. తన మీద దాడి చేస్తుంటే.. ప్రభుత్వం తనకు కేటాయించిన గన్మన్ రక్షణగా రావడంతో అతడిని పట్టుకున్నారన్నారు. 30-40 మంది కలిసి తన మీద దాడి చేశారని, దాంతో పెళ్లికి వచ్చినవాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. జరిగిన వాస్తవాలను తాను పోలీసులకు చెప్పి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఎన్ కన్వెన్షన్లో సీసీటీవీ కెమెరా ఫుటేజి ఉంటుందని, దాన్ని బహిర్గతం చేస్తే ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో తేలిపోతుందని అన్నారు.ఈ సంఘటనలో కచ్చితంగా న్యాయం గెలవాలని, ఎవరిది తప్పయితే వారికి శిక్ష పడాలని ఆశిస్తున్నానని తెలిపారు. చట్టాలపైన, ప్రజాస్వామ్య విలువలపైన తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.