విష్ణుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు
హైదరాబాద్ : కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన కేసులో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విష్ణుకు నోటీసులు జారీచేయనున్న పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా... ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. విష్ణు, వంశీచంద్ రెడ్డి పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.