నరకం నుంచి నయా జీవితంలోకి.. | Asma new life | Sakshi
Sakshi News home page

నరకం నుంచి నయా జీవితంలోకి..

Published Mon, Aug 17 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

నరకం నుంచి  నయా జీవితంలోకి..

నరకం నుంచి నయా జీవితంలోకి..

వేడుకగా ఆస్మా నిఖా
 
 రాజేంద్రనగర్ / లంగర్‌హౌస్ : కన్న తండ్రే కాలయముడై పెట్టిన నరకం నుంచి బయటపడిన ఆస్మా కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ఆదివారం హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్ ఆవరణ లో ఆస్మా, మహ్మద్ మాజిద్‌కు అధికారులే పెద్దలుగా, గ్రామంలోని ప్రజలే బంధువులుగా హాజరై నిఖా జరిపించారు. పోలీసులు, ట్రస్ట్ నిర్వాహకులు, బస్తీ పెద్దలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు. వధువు ను అత్తారింటికి పంపించే సమయంలో ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న వారు కన్నీరు పెట్టారు.  
 
ఇదీ ఆస్మా కథ..

 సరూర్‌నగర్ మండలం భగత్‌సింగ్ నగర్‌కు చెందిన మహ్మద్ అన్వర్ మియా, దౌలత్‌బీ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఆస్మా ఒకరు. 2007లో దౌలత్‌బీ చనిపోయింది. అప్పటి నుంచి తనకు అడ్డుగా ఉన్నారని ఆస్మాతో పాటు చెల్లెలు నజ్మాను తండ్రి అన్వర్ ఇంట్లో నిర్భంధించి తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా కుంగిపోయి మృత్యువుకు చేరువైన వీరిని పోలీసుల సాయంతో స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్‌లో ఆశ్రయం ఇచ్చారు. గత ఎనిమిదేళ్లుగా ఆస్మా, నజ్మాలు ఇక్కడే ఉంటున్నారు. ఆస్మా కిచెన్ నిర్వహణ చూసుకునేది. ఇదిలా ఉండగా, భగత్‌సింగ్ నగర్‌లోని ఫారుఖ్ మహ్మద్, మసీద్ నిర్వహకులు వీరి గురించి తెలుసుకుని సాయం అందించారు. కొత్త ఇంటిని నిర్మించారు. అదే బస్తీకి చెందిన అబ్దుల్ రహమాన్ కుమారుడు మహ్మద్ అబ్దుల్ మాజిద్‌కు ఆస్మాను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు.

విషయాన్ని ట్రస్ట్ ఇన్‌చార్జి పద్మావతికి చెప్పగా, ఆమె స్వచ్ఛంద సంస్థలు, నార్సింగి పోలీసులు, రాజేంద్రనగర్ ఏసీపీ, గ్రామ సర్పంచ్ సాయం కోరారు. అందరూ ముందుకు రావడంతో ఆదివారం వీరి వివాహాన్ని వేడుకగా జరిపించారు. అత్తాపూర్ అగర్వాల్ సమాజ్ నిర్వహకులు భోజనాలు ఏర్పాటు చేశారు. యాంకర్ ఉదయభాను, సర్పంచ్ కృష్ణారెడ్డి, ఏసీపీ గంగారెడ్డి, ఇన్స్‌పెక్టర్ రాంచంద్రరావు, ఎస్సై సుధీర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాయం అందించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఆజీజ్ పాషా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement