
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా గాయకుడు గద్దర్... కానిస్టేబుల్ దాసరి రాజేంద్ర ప్రసాద్... ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్... జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మా బేగం... ఈ ఐదుగురిలో ఉన్న సారూప్యత శరీరంలో బుల్లెట్స్ ఉండడం. ఆస్మా బేగం సుదీర్ఘ కాలం తన శరీరంలో బుల్లెట్‌తోనే బతికినా... వెన్నుపూస ఉదరకోశ భాగం మధ్యలో ఉన్న దాన్ని నిమ్స్ వైద్యులు ఆదివారం శస్త్ర చికిత్స చేసి తీసేశారు. మిగిలిన నలుగురూ మాత్రం ఇప్పటికీ ‘బుల్లెట్ మ్యాన్స్’గానే కొనసాగుతున్నారు. సాధారణంగా ప్రాణహాని కలిగించే తూటాను వీరంతా తమ శరీరంలో భాగంగా ఉంచుకోవాల్సి వచ్చింది. ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్‌రావ్ అలియాస్ గద్దర్‌పై 1997లో కాల్పులు జరిగాయి. ఆల్వాల్ వెంకటాపురంలోని ఆయన ఇంటి వద్దే జరిగిన ఈ ఉదంతంలో ఆయన శరీరంలోకి ఐదు తూటాలు దూసుకుపోయాయి. నాలుగింటిని ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు ఆయన వెన్నెముక సమీపంలో ‘స్థిరపడిపోయిన’ ఐదో దాన్ని మాత్రం తీస్తే ప్రమాదమని వదిలేశారు. నగర పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దాసరి రాజేంద్రప్రసాద్‌పై 2009లో కాల్పులు జరిగాయి.
మక్కా మసీదు వద్ద జరిగిన పోలీసు కాల్పులకు ప్రతీకారంగా అంటూ తెహరీక్ గుల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాదబాట పట్టిన వికారుద్దీన్ అహ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాతబస్తీలోని ఫలక్‌నుమ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న నాలుల్‌చింత వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై వికార్ కాల్పులు జరిపాడు. హోంగార్డు బాలస్వామి అక్కడిక్కడే చనిపోగా... పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాజేంద్ర తలలోకి తూటా దూసుకుపోయింది. మెదడుకు సమీపంలో ఉన్న దీన్ని తొలగించే ప్రయత్నం చేసినా, తొలగించినా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని చెప్పిన వైద్యులు అలానే ఉంచేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై 2011లో హత్యాయత్నం జరిగింది. పాతబస్తీలోని బార్కస్ ప్రాంతంలో పహిల్వాన్ అండ్ గ్యాంగ్ ఆయనపై విరుచుకుపడింది. కత్తులు, తుపాకులతో దాడికి తెగపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉన్న ఆయనకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. శరీరంలో ఉన్న ఇతర బుల్లెట్స్ తొలగించినా మూత్రపిండం, వెన్నెముక సమీపంలో ఉన్న తూటా జోలికి మాత్రం వైద్యులు పోలేదు. దీన్ని తీసే ప్రయత్నం చేస్తే అక్బర్ కాళ్ళు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని అలానే ఉంచేశారు. ఈ ముగ్గురి పైనా గుర్తుతెలియని వ్యక్తులు, ఉగ్రవాదులు, ప్రత్యర్థులు విరుచుకు పడటంతో వారు ‘బుల్లెట్ మ్యాన్స్’గా మారారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కథ వేరు. తనపై దాడికి తానే వేసుకున్న సెల్ఫ్ స్కెచ్‌లో బుల్లెట్ మ్యాన్‌గా మారాడు. 2017లో బంజారాహిల్స్‌లోని ఇతడి ఇంట్లో హైడ్రామా చోటు చేసుకుంది. తాను ఏర్పాటు చేసుకున్న మనుషులతో తనపైనే కాల్పులు చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ తూటా ఆయన వెన్నుముక సమీపంలోకి వెళ్లి ఆగింది. దీన్ని కదిలించినా ప్రమాదమే కావడంతో వైద్యులు అలానే ఉంచేశారు.
తుపాకులు నాటువైతే ఎగ్జిట్ కావు: నిపుణులు
ఓ వ్యక్తిపై జరిగిన కాల్పుల ఉదంతంలో రెండు రకాలైన గాయాలు ఉంటాయి. తూటా లోపలకు దూసుకుపోయిన దాన్ని ఎంట్రీ ఊండ్ అని... శరీరం ద్వారా బయటకు దూసుకువచ్చిన దాన్ని ఎగ్జిట్ ఊండ్ అని అంటారు. నాటు తుపాకుల నుంచి వెలువడిన తూటాలు శరీరంలోకి దూసుకుపోతాయి తప్ప రెండో వైపు నుంచి బయటకు దూసుకురావు. గద్దర్, రాజేంద్ర ప్రసాద్, అక్బరుద్దీన్, విక్రమ్‌గౌడ్‌లపై కాల్పులకు వాడింది నాటు తుపాకులు కావడంతో తూటాలు ఎగ్జిట్ కాలేదు. దీనికి తోడు ఇవన్నీ పాయింట్–32 క్యాలిబర్ బుల్లెట్స్ కావడమూ ఓ కారణమే. కంపెనీ మేడ్‌గా ఉండే లైసెన్డ్స్ ఆయుధాలు లేదా పోలీసులు వినియోగించే సర్వీస్ రివాల్వర్స్‌లో కాల్పులు జరిపితే తూటా శరీరంలోకి వెళ్ళడంతో పాటు రెండో వైపు నుంచి దూసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇవి అత్యంత ప్రమాదకర ఆయుధాలు.
బుల్లెట్స్ అన్నిలెడ్‌తోనే తయారీ
తుపాకుల్లో వాడే తూటాలను లెడ్‌తో తయారు చేస్తారు. కొన్ని పూర్తిగా లెడ్‌తోనే ఉండగా... మరికొన్న రకాలైన బుల్లెట్స్‌కు పైన కాపర్ లేదా బ్రాస్‌తో చేసిన జాకెట్ ఉంటుంది. శరీరంలోని దిగిన బుల్లెట్స్‌లో కొన్నింటిని వైద్యులు అలానే ఉంచేస్తారు. వీటివల్ల తొలినాళ్ళల్లో ఇబ్బంది ఉన్నా... ఆపై టిష్యూ సర్దుకుపోయి తూటాను తనలో ఇముడ్చుకుంటుంది. ఎముకలు విరిగినప్పుడు ఐరన్ ప్లేట్స్ వేస్తుంటారు. వీటినీ టిష్యూ తనలో ఇముడ్చుకున్న మాదిరిగానే తూటాలకూ ఎడ్జెస్ట్ అవుతుంది. శరీరంలోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో తూటాలు ఉండిపోతే మాత్రం జీవితకాలం వైద్యుల సలహాసూచనల మేరకు ఔషధాలు వాడాల్సి ఉంటుంది. – డాక్టర్ వెంకన్న, హైదరాబాద్ క్లూస్ ఇన్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment