శ్రీనగర్‌ చదువులమ్మ | Special Story About Asma From Jammu Kashmir | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ చదువులమ్మ

Published Sat, Jul 18 2020 12:00 AM | Last Updated on Sat, Jul 18 2020 12:00 AM

Special Story About Asma From Jammu Kashmir - Sakshi

చదవాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రతకు ప్రశాంతత కావాలి. జమ్ము– కశ్మీర్‌లో ప్రశాంతత తుపాకీ మొన అంత కర్కశమైనది. బూట్ల చప్పుడంత కఠినమైనది. అయినప్పటికీ అస్మా షకీల్‌ చదవగలిగింది.
ఇంటర్‌ సి.బి.ఎస్‌.సి ఫలితాలలో టాపర్‌గా నిలువగలిగింది. అంతేనా? అమెరికా యూనివర్సిటీ నుంచి రెండు కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను కూడా గెలుచుకుంది.

శ్రీనగర్‌ నుంచి రోజువారీ వినిపించే వార్తల్లాంటివి కాకుండా ఈ వార్త చాలామందికి సంతోషం కలిగింది. శ్రీనగర్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన అస్మా షకీల్‌ సోమవారం వెలువడ్డ సి.బి.ఎస్‌.ఇ ఇంటర్‌ ఫలితాలలో 98.2 శాతం మార్కులతో జమ్ము–కశ్మీర్‌ లోయలో టాపర్‌గా నిలిచింది. 500 మార్కులకు ఆమె 492 మార్కులు సాధించింది. శ్రీనగర్‌లోని బార్జుల్లా ప్రాంతంలో నివాసం ఉండే అస్మా తల్లి గృహిణి. తండ్రి వ్యాపార వేత్త. ఆమెకు అన్నయ్య ఉన్నాడు. ఇస్మా షకీల్‌ అనే కవల సోదరి ఉంది. ఇస్మాకు ఇవే పరీక్షలలో 95 శాతం మార్కులు వచ్చాయి. ‘చెల్లెలిని మోసం చేసి అక్క ముందుకు వెళ్లిపోయింది’ అని అస్మా గురించి స్నేహితులు సరదాగా జోక్‌ చేస్తున్నారిప్పుడు.

రెండు కోట్ల స్కాలర్‌షిప్‌
సి.బి.ఎస్‌.ఇ ఇంటర్‌ ఫలితాలలో టాపర్‌గా నిలిచిన అస్మా ఈ పరీక్షలు రాయడానికి ముందే తాను పై చదువులు విదేశాలలో చదవాలని నిశ్చయించుకుంది. ఇంట్లో కూడా ఇందుకు అనుమతి లభించింది. అయితే 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్ము–కశ్మీర్‌లకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ఫలితంగా అక్కడ లాక్‌డౌన్‌ వచ్చింది. స్కూళ్లు మూతపడ్డాయి. ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ పోయింది. ఒకవైపు చదువు టెన్షన్‌.. మరో వైపు విదేశాలలో వివిధ యూనివర్సిటీలకు అప్లై చేయాలంటే ఇంటర్‌నెట్‌ కావాలి.

‘నేను ఒక నిమిషం డీలా పడిపోయాను. కాని మా స్కూల్‌ కరెస్పాండెంట్‌ అయిన విజయ్‌ ధర్‌ సార్‌ నన్ను పిలిచి– నువ్వు ఆగొద్దు. రెక్కలు సాచి ఎగిరిపో అని చెప్పిన మాటలు మర్చిపోలేదు.’ అంది అస్మా. ఆమె కేవలం విదేశాలలో ఉన్న యూనివర్సిటీలకు అప్లై చేసేందుకుకు ఇంటర్‌నెట్‌ కోసం డిసెంబర్‌లో ఢిల్లీకి వెళ్లి జనవరి వరకు అక్కడే ఉండిపోయింది. ఫిబ్రవరి మొదటి వారంలో శ్రీనగర్‌ తిరిగి వచ్చి ఫిబ్రవరి ఆఖరువారంలో జరిగిన పరీక్షలు రాసింది. ‘కేవలం 20 రోజులు మాత్రమే చదివాను’ అని అస్మా అంది. కాని దేవుడు ఆమెయందు ఉన్నాడు. అస్మా టాపర్‌గా వచ్చింది.

అంతే కాదు అమెరికాకు చెందిన జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ తన కతార్‌ శాఖలో అస్మా పై చదువులు చదవడానికి పూర్తిస్థాయి స్కాలర్‌షిప్‌ మంజూరు చేసింది. దీని విలువ అక్షరాలా 2 కోట్లు. ఇది చాలదన్నట్టు అస్మా నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ (ఇంగ్లాండ్‌) ‘ఆసియా ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ గెలుచుకుంది. దీని విలువ ఐదు లక్షల రూపాయలు. ఈ మొత్తం వార్తలు ఒకేసారి రావడంతో అస్మా తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అస్మా తల్లి ఆనందబాష్పాలు రాల్చగా తండ్రి ‘నేను ఎప్పుడూ నీ గురించే ప్రార్థించాను తల్లీ’ అని దగ్గరకు తీసుకున్నాడు.

మానవహక్కుల కార్యకర్త అవుతా
గొప్ప మార్కులు సాధించుకున్నవారు గొప్ప సంపద తెచ్చే కెరీర్‌లను ఎంచుకుంటారు. కాని అస్మా మాత్రం నేను మానవహక్కుల కార్యకర్త అవుతా అని చెబుతోంది. ‘నాకు అంతర్జాతీయ రాజకీయాల పట్ల, అంతర్జాతీయ న్యాయవిధానాల పట్ల ఆసక్తి ఉంది. నా పై చదువులన్నీ అవే. వాటిని చదివి మానవ హక్కుల కోసం ఏం చేయగలనో అది చేస్తా’ అని చెప్పిందామె. ‘నీకు ఏ కష్టం వచ్చినా దేవునితో సంభాషించు. నీకేం కావాలో అడుగు అని దేవుడు కాచుకుని ఉంటాడు. అడగకపోవడం మన తప్పు’ అంటుంది అస్మా. అస్మా ఆగస్టులో తన పై చదువుల కోసం కతార్‌కు వెళ్లనుంది. భవిష్యత్తులో మనం ఈ అమ్మాయి గురించి తప్పక వార్తలు వింటూ ఉంటామని ఆమె సంకల్పాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. – సాక్షి ఫ్యామిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement