డబ్బుల కోసం చంపేస్తారు
► దాదాపు పది హత్యలుచేసిన యాదగిరి
► చోరీలు, చైన్ స్నాచింగ్‌లలో దాదారావు సహకారం
► శిక్ష అనుభవిస్తూ 2015లో చర్లపల్లి జైలు నుంచి పరార్
► బీదర్ సమీపంలో ఆటోడ్రైవర్ హత్య
► పోలీసుల అదుపులో నిందితులు
మియాపూర్: ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు, మియాపూర్ సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వెనుకొండ మండలం నూజర్ల గ్రామానికి చెందిన ఏడుకొండలు(35) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 9న ఏడుకొండలు కనిపించకుండా పోయాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ నమోదైంది.
దాదాపు పది హత్యలు..
ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామానికి చెందిన కుంచెం యాదగిరి(42) దొంగతనాలు, హత్యలకు పాల్పడుతుండేవాడు. దాదాపుగా 10 హత్యలు చేశాడు. యావత్ జీవ కారాగార శిక్ష పడింది. 2015లో చర్లపల్లి జైలునుంచి తప్పించుకున్నాడు. కల్లు కాంపౌడ్‌లకు వెళ్లి అమాయకులతో స్నేహంగా మాట్లాడి వారితో కలిసి మద్యం తాగి డబ్బులు లాక్కొని చంపేసేవాడు. సిద్దిపేట్‌లో ముగ్గురిని, చేగుంటలో ముగ్గురిని, తూప్రాన్‌లో ఒక్కరిని, నర్సాపూర్‌లో ఇద్దరిని, మాసాయిపేట్‌లో ఒక్కరిని హత్య చేశాడు.
బీదర్ సమీపంలో చంపేశారు..
ఏడుకొండలును మహారాష్ట్ర, ఉద్గిర్‌కు చెందిన దాదారావుతో కలిసి కర్నాటక రాష్ట్రంలోని బీదర్ సమీపంలో చంపేసి ఆటోను దొంగిలించారు. గతంలో వీరిద్దరిపై కేపీహెచ్‌బీ, మియాపూర్, కూకట్‌పల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పది దొంగతనాలు, రెండు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన స్థలానికి తీసికెళ్లి ఆరా తీయగా అస్తికలు లభ్యమయ్యాయి. వారి వద్ద నుంచి 19 తులాల బంగారం, రెండు ఆటో ట్రాలీలు, రెండు బైకులు, ఓ కలర్ టీవీ, రూ.1.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపైపీడీయాక్ట్‌నమోదు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డునపడ్డ కుటుంబం...
ఏడుకొండలు మృతితో భార్య శివలీల ఇద్దరు కుమారులు వరుణ్ సాయి(6), ధనుష్ రత్నా(3) రోడ్డునపడ్డారు.