ముగ్గురికి ‘విశిష్ట’ పురస్కారాలు
- అశోక్‌తేజ, జయరాజు, భాష్యం ఎంపిక
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- పంద్రాగస్టునాడు అందజేత
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముగ్గురు సాహితీ ప్రముఖులకు విశిష్ట పురస్కారాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ గీతరచయితలు సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్‌లతో పాటు ప్రముఖ సంస్కృత, తెలుగు విద్వాంసుడు శ్రీభాష్యం విజయసారథిలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద ఒక్కొక్కరికి లక్షా నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేస్తారు.
అశోక్‌తేజ..
అవిభాజ్య నల్ల గొండ జిల్లాలోని గుండాల మం డలం సుద్దాల గ్రామానికి చెందిన అశోక్‌తేజ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. చిన్ననాటి నుంచే ఆయన సినిమాలకు పాటలు రాశారు. ఒసేయ్ రాములమ్మ, నిన్నే పెళ్లాడుతా చిత్రాలకు పాటలు రాసిన తర్వాత ఆయన మంచి గుర్తింపు పొందారు. ఠాగూర్ సినిమా కోసం ఆయన రాసిన ‘నేను సైతం’అనే గీతానికి 2003లో జాతీయ అవార్డు కూడా లభించింది.
జయరాజు..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బయ్యారం గ్రామానికి చెందిన జయరాజు సింగరేణి ఉద్యోగి. ఇఫ్టూ కార్మికోద్యమంలో పనిచేసిన ఈయన తన చైతన్యవంతమైన పాటలతో ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందారు. ప్రకృతి, మానవసంబంధాలపై జయరాజు ఎక్కువ రచనలు చేశారు. వానమ్మ... వానమ్మ, వందనాలమ్మా లాంటి గీతాలతో ఆయన ప్రాచుర్యం పొందారు.
శ్రీభాష్యం విజయసారథి..
కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామానికి చెందిన శ్రీభాష్యం విజయసారథి ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరిగింది. ఏడేళ్ల వయసులోనే ఆయన సంస్కృత కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆలిండియా రేడియో ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కవి సమ్మేళనాలకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈయన వాస్తు శాస్త్రంలోనూ పాండిత్యం సంపాదించారు.