సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌ | KCR makes three major announcements | Sakshi
Sakshi News home page

సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌

Published Tue, Aug 16 2016 1:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌ - Sakshi

సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌

70వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో సీఎం కేసీఆర్‌
ఏటా రూ.30 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు

♦ ఎస్టీలు, మైనారిటీలకు జనాభా
♦  దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం
♦  4 నెలల్లో రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌
♦ కాళేశ్వరంపై 23న ‘మహా’ ఒప్పందం
♦ దసరా కానుకగా కొత్త జిల్లాల ఏర్పాటు
♦ అరాచక శక్తుల ఆట కట్టించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడి
♦ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నిజమైన అభివృద్ధి అంటే పేదలకు భరోసా, భద్రత కల్పించడమేనని చెప్పారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.30వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం చారిత్రక గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. అభివృద్ధి నిరోధక శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజాబలమే అండగా భావించి రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగా పురోగమిస్తున్నదని కేసీఆర్‌ చెప్పారు. లక్ష్య సాధనకు అవసరమైన మనో బలాన్ని, మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇదే గోల్కొండపై తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రెండు నెలల పసిబిడ్డ.. బాలారిష్టాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ స్థిరమైన పాలనను అందిస్తున్నాం.

రెండేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీ, ఈబీసీలకు కూడా అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేసి.. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్‌ సంకల్పానికి బీజం వేశాం. హాస్టళ్లలో, స్కూళ్లలో విద్యార్థులకు పెడుతున్న సన్న బియ్యం అన్నం కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీల వసతి గృహాల విద్యార్థులకు సైతం అందిస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న ఎస్టీలు, మైనారిటీలు పేదరికంలో మగ్గుతున్నారని.. వారికి త్వరలోనే జనాభా దామాషా అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. పేద బ్రాహ్మణుల కోసం బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కేటాయించామని.. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తగిన పథకాలను త్వరలో రూపొందిస్తామని చెప్పారు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఆయన 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నామని తెలిపారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమర వీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా పండుగ కానుకగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సత్సంబంధాలు
కేంద్రంతో సఖ్యత, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేసీఆర్‌ చెప్పారు. నీటిపారుదల, విద్యుత్‌ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో సయోధ్య సాధించుకోగలిగామన్నారు. మరో 4 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ రాష్ట్రానికి అందుతుందని తెలిపారు. మహారాష్ట్రతో ఉన్న వివాదాల పరిష్కారం కోసం తీసుకున్న చొరవ ఫలించిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 23న చరిత్రాత్మక ఒప్పందం కుదరనుందని పేర్కొన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.

కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మన రాష్ట్రానికి ఉన్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలను శరవేగంగా నిర్మించడానికి పూనుకున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం ద్వారా ఈ ఖరీఫ్‌ నుంచే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పథకాల కింద ప్రస్తుతం 4.5లక్షల ఎకరాలకు నీరందుతోందని తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పనులన్నీ పూర్తి చేసి ఆ జిల్లాలో 6లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కొమురం భీమ్, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని.. వచ్చే ఏడాది నాటికి లక్ష ఎకరాలకు నీరందనుందని చెప్పారు.

మిషన్‌ కాకతీయతో జలకళ
మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 8 వేల చెరువులు బాగుపడ్డాయని కేసీఆర్‌ చెప్పారు. రెండో దశలో 9 వేల చెరువుల పనులను చేపట్టామన్నారు. మిషన్‌ కాకతీయతో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల చెరువులు నిండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇక మిషన్‌ భగీరథ ద్వారా 2018 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ఇళ్లకు నల్లా ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. చాలినన్ని ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చిందని కేసీఆర్‌ తెలిపారు. ఈ ఏడాది లక్షా 26 వేల ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.420 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని చెప్పారు. కూరగాయలు, పండ్లు, పూల పెంపకం కోసం 75 శాతం సబ్సిడీతో గ్రీన్‌హౌజ్, పాలీహౌజ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. 1,311 వ్యవసాయ విస్తరణాధికారులు, 120 వ్యవసాయాధికారులు, 75 మంది హార్టికల్చర్‌ అధికారుల నియామకాన్ని చేపట్టామని.. కొత్తగా హార్టికల్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చే నాటికి 4.17 లక్షల టన్నుల సామర్థ్యం గల 176 గోదాములు మాత్రమే ఉండేవని... ఈ రెండేళ్లలోనే 17.07 లక్షల టన్నుల సామర్థ్యం గల 330 గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు 2,303 పరిశ్రమలకు అనుమతులివ్వడంతో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని... లక్షా 75 వేల కొత్త ఉద్యోగాలు లభించాయని సీఎం పేర్కొన్నారు. ఐటీ రంగంలో 13.26 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని.. గతేడాది రూ.75 వేల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు చేసిందని తెలిపారు. 2018లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు హైదరాబాద్‌ వేదిక కానుండడం గర్వకారణమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 37 వేల నియామకాలు జరిపిందని.. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నడుస్తున్నదని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని కేసీఆర్‌ తెలిపారు. 40 డయాలసిస్‌ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటవుతున్నాయన్నారు.

భావి తరాల కోసమే హరితహారం
విచక్షణారహితంగా సాగిన అడవుల విధ్వంసం పర్యావరణానికి ముప్పు తెచ్చిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడంతో రెండు మూడేళ్లకోసారి కచ్చితంగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి దాపురించిందని చెప్పారు. అందువల్లే పచ్చదనాన్ని పెంచి భవిష్యత్‌ తరాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పచ్చదనం పెంపునకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమే హరితహారమని... తొలి ప్రయత్నం ఆస్ట్రేలియాలో, రెండోది చైనాలో గోబి ఎడారి విస్తరణ నిరోధించడానికి జరిగిందని తెలిపారు.

అరాచక శక్తుల ఆటకట్టిస్తున్నాం
శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దృఢ చిత్తంతో వ్యవహరిస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అరాచక శక్తుల ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. ఫలితాలు మీ కళ్ల ముందే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందన్నారు. జాతీయ పోలీసు పతకాల్లో అత్యధికం తెలంగాణ పోలీసులే దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టడానికి మన పోలీసులు ప్రదర్శిస్తున్న సాహసం, చొరవకు యావత్‌ జాతి గర్విస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement