బాబు... రావత్..ఓ చిన్నట్విస్ట్..!
‘‘థర్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్.. సీఎంగా.. ప్రతిపక్ష నేతగా నాదే రికార్డు అంటూ’’ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇటీవలే షాక్‌కు గురయ్యారట. ఎందుకంటారా.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి తెలంగాణకు వెళ్లేందుకు క్యాట్‌కు దరఖాస్తు చేసుకున్న ఎస్.ఎస్.రావత్ నిర్ణయం తెలుసుకున్న చంద్రబాబు కొద్ది సేపు తేరుకోలేదట. క్యాట్ కూడా రావత్‌కు అనుమతి ఇవ్వడంతో బాబు షాక్ తిన్నారట. ఏపీలో పరిశ్రమల స్థాపన ప్రమోషన్‌కు దావోస్‌కు వెళ్లిన రావత్ అక్కడే స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలు దెబ్బతినడంతో అక్కడే చికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా రావత్ బాగోగులకు ఆదేశాలిచ్చారు.
దావోస్ నుంచి తిరిగొచ్చిన రావత్ తెలంగాణకు వెళ్లేందుకు తీసుకున్న నిర్ణయంతో బాబు కొంత ఇబ్బందికి గురయ్యారట. రావత్ బాటలోనే పలువురు ఐఏఎస్‌లు పొరుగు రాష్ట్రానికి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారనే వార్తలకు బాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. తాను ఏం తక్కువ చేశాను.. అని బాబు ముఖ్యుల వద్ద వాపోతుంటే.. అదేదో సినిమాలో పాపులరైన డైలాగు ‘‘అంతా మీరే చేశారు..’’ అని బాబు కోటరీ ముఖ్యులు అంటున్నారట. ప్రభుత్వ విధానమేంటో స్పష్టంగా చెప్పకుండా.. నిత్యం గంటల కొద్దీ సమీక్షలు... పొద్దుపోయే వరకు మీటింగులతో ఐఏఎస్‌లు విసుక్కుని పొరుగు రాష్ట్రానికి, కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారట. ఐఏఎస్‌ల ఆలోచన తెలుసుకున్న బాబు తన పంథా మార్చుకుంటారా.. లేక భ్రమలు కల్పిస్తూ కాగితాల్లోనే అభివృద్ధి చూసుకుంటారా? అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.