లోకేశ్ కోసం మంత్రివర్గంలో మార్పులు!
ఆయనకు పరిశ్రమల శాఖతోపాటు ఐటీ శాఖ?
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కల త్వరలోనే నెరవేరనుంది. ఆయన మంత్రి పదవి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు తన కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ముఖ్యంగా లోకేశ్‌కు అవకాశం కల్పించడం కోసమే కేబినెట్‌లో మార్పులు చేర్పులకు చంద్రబాబు పూనుకుంటున్నట్లు సమాచారం. దీపావళి పండుగ ముందు గానీ, ఆ తరువాత గానీ రాష్ట్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధానంగా లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని అన్ని వైపుల నుంచి ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇటీవల జరిగిన మూడు రోజుల పార్టీ శిక్షణా కార్యక్రమానికి తొలి రెండు రోజులు లోకేశ్ హాజరు కాని సంగతి తెలిసిందే. కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి జాప్యం చేస్తున్నందునే లోకేశ్ అలిగినట్లు టీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను శాంతింపజేయడానికి త్వరలోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేబినెట్‌లోని కొంతమందికి ఉద్వాసన పలకడంతోపాటు మరి కొంతమంది శాఖల్లో మార్పులు చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేసిన తరువాత జన్మభూమి కార్యక్రమం అనంతరం చంద్రబాబు నవంబరు 12వ తేదీన అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్తారని తెలిసింది.
మృణాళినికి ఉద్వాసన తప్పదా?
ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను నిర్వహిస్తున్న కె.మృణాళిని మంత్రివర్గం నుంచి తప్పించి, ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. లోకేశ్‌కు కీలకమైన పరిశ్రమల శాఖతోపాటు ఐటీ శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది.