ఎక్కడి దొంగలు.. అక్కడే!  | Chandrababu Naidu And Nara Lokesh Silence On IT Notices And Corruption - Sakshi
Sakshi News home page

ఎక్కడి దొంగలు.. అక్కడే! 

Published Thu, Sep 7 2023 5:07 AM | Last Updated on Thu, Sep 7 2023 11:34 AM

Chandrababu And Nara Lokesh Silence On IT notices and Corruption - Sakshi

సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు తన ఖాతాల్లోకి నేరుగా రప్పించుకున్న రూ.118 కోట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చినట్లు జాతీయ ఇంగ్లిష్‌ డైలీ ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ ప్రచురించి దాదాపు వారం దాటింది. నాటి నుంచీ ఈ నోటీసులతో పాటు బాబు హయాంలో కాంట్రాక్టు సంస్థల నుంచి ముడుపులు ఎలా అందుకున్నారో, ఖజానాను ఎలా కొల్లగొట్టారో వివరాలతో సహా వివిధ పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి.

కాకపోతే ఊరూ­రూ వెళుతున్న బాబుగానీ... పాదయాత్రంటూ తిరుగుతున్న ఆయన తనయుడు లోకేశ్‌ గానీ.. షూటింగ్‌ గ్యాప్‌ తీసుకున్న పవన్‌ గానీ ఎవ్వరూ దీనిపై మాట్లాడటం లేదు. ఇక అందరిపైనా ఉన్నవీ లేనివీ రాసే ‘ఈనాడు’, దాని తోక­పత్రిక, తోక చానెళ్లు... ఏవీ ఈ అంశాన్నే ప్రస్తావించటం లేదు. ఆఖరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చిన పురంధేశ్వరి కూడా దీన్నో సాధారణ అంశంగా తేల్చేశారు తప్ప బాబు అవినీతికి నిదర్శనంగా చూడటం లేదు. ఏమయింది వీళ్లకి? 

ఇక చంద్రబాబు విషయానికొస్తే అటు ఐటీ విభాగానికేమో.. ‘నాకు నోటీసులిచ్చే అధికారం మీకెక్కడిది?’ ‘నాకు సాక్ష్యాధారాలు చూపించండి’ ‘ఫలానా సంవత్సరానికి ఇది వర్తించదు’ అనే డొంకతిరుగుడు జవాబులిస్తున్నారు. ఇటు ప్రజల ముందేమో... ‘నాపై కుట్ర చేస్తున్నారు’ ‘నన్ను అరెస్టు చేస్తారేమో’ ‘నన్ను ఏ క్షణాన్నైనా అరెస్టు చేయొచ్చు’ అని నానా నంగనాచి కబుర్లు చెబుతున్నారు. అంతే తప్ప... ఆ నోటీసులు ఎందుకొచ్చాయి? తాను నిజంగా అవినీతి చేశాడా... లేదా? ఆ 118 కోట్లూ నిజంగా ముట్టాయా? కాంట్రాక్టు సంస్థలను బెదిరించటం అబద్ధమా? మనోజ్‌ పార్థసానితో తనకు సంబంధాలున్నాయా... లేవా? దుబాయ్‌లో డబ్బులు తీసుకున్నాడా.. లేదా? అనే ఏ విషయమూ చెప్పటం లేదు.

పైపెచ్చు ఐటీ శాఖకే సమాధానాలిస్తారంటూ ఆయన తరఫున కొందరు బీరాలు పోవటమూ మొదలయ్యింది. కేంద్రం ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆదాయపు పన్ను శాఖ... రిటర్నుల్లో చూపించని మొత్తం ఎవరి లావాదేవీల్లోనైనా కనిపించినపుడు నోటీసులివ్వటం మామూలే. కాకపోతే చంద్రబాబుది రిటర్నుల్లో చూపించని మొత్తం మాత్రమే కాదు. అది అక్రమంగా ఆర్జించిన అవినీతి సొమ్ము. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని కట్టబెట్టి.. లంచాల రూపంలో తన ఖాతాలోకి నేరుగా రప్పించుకున్న అక్రమార్జన.

పైపెచ్చు ఆయన 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ!!. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు. మరి ప్రజలకు జవాబుదారీయే కదా? బయట అన్ని సభల్లో మాట్లాడుతున్న చంద్రబాబుకు... తనపై వచ్చిన నోటీసులపై స్పందించాల్సిన ఆవశ్యకత లేదా? ఇలాంటి రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? దొంగలంతా కలిసి... ఎక్కడి వారక్కడే గప్‌చుప్‌... అన్న తరహాలో నోరు మూసుకున్నంత మాత్రాన విషయం అందరికీ తెలియకుండా ఉంటుందా? జబాబు చెప్పాల్సిన బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోగలరా? 

ఇదీ అసలు కథ... 
అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా సాగించిన అవినీతి బండారం బట్టబయలవుతున్న కొద్దీ బాబులో ఆందోళన రెట్టింపు అవుతోంది. ఇన్నాళ్లూ ప్రతి వ్యవస్థలో తన మనుషుల్ని పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్‌ చేయడం ద్వారా ‘నిప్పు’లా చెలామణి అయిన బాబుకు... రోజులన్నీ ఒకేలా ఉండవని ఇప్పుడు అర్థమవుతోంది. రూ.8వేల కోట్ల కాంట్రాక్టుల కేటాయింపులో షెల్‌ కంపెనీలు, బోగస్‌ ఇన్వాయిస్‌లతో సాగించిన అవినీతిని ఐటీ శాఖ నిగ్గు తేల్చింది. నోటీసులిచ్చింది. ఆధారాలూ చూపించింది.

తప్పించుకునేందుకు బాబు వేసిన ఎత్తుల్ని తిప్పికొట్టింది. దీంతో బాబుకు దారులు మూసుకుపోయాయి. మరోవైపు రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో చంద్రబాబు అవినీతిని సీఐడీకి చెందిన సిట్‌ బృందం ఆధారాలతో సహా వెలికి తీసింది. ఆ రెండు వ్యవహారాల్లోనూ షెల్‌ కంపెనీలు, బోగస్‌ ఇన్వాయిస్‌ల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకే చేరిందన్నది బట్టబయలైంది. ఈ స్కిల్‌ స్కామ్‌లో హవాలా దందా నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా దిగింది.  

అదే కుతంత్రం...మళ్లీ మళ్లీ 
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన చంద్రబాబు... తన అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మళ్లీ పాత దారే ఎంచుకున్నారు. తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు.  దానిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పందించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పరోక్షంగా ఆదేశించారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలన్నది బాబు పన్నాగం.

తాను ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ చంద్రబాబు అనుసరించే దిగజారుడు రాజకీయ ఎత్తుగడ ఇదే. 2015లో హైదరాబాద్‌లో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడూ ఇదే చేశారు. తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేస్తారేమో అని చెబుతూ రాత్రికి రాత్రి హైదరాబాద్‌ విడిచిపెట్టి అమరావతి వచ్చేశారు. పైపెచ్చు రాష్ట్రం నుంచే పరిపాలన చేసేందుకే వచ్చేశానని చెప్పుకొచ్చారు. పైగా తనపై కేసు పెట్టడాన్ని ఆంధ్రపై తెలంగాణ ప్రభుత్వం చేసిన దాడిగా వక్రీకరించారు.

అంతేతప్ప తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలించేందుకు కోట్ల రూపాయలు లంచంగా ఇస్తూ పట్టుబడ్డానన్న వాస్తవాన్ని మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడూ అదే సూత్రం అమలు చేస్తున్నారు.  ఇటీవల అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పర్యటనల్లో పోలీసులపై దాడులకు పాల్పడేలా టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రేరేపించారు. తాజాగా భీమవరంలోనూ అదే రీతిలో  ఘర్షణలు సృష్టించారు. ఇపుడు తనను అరెస్టు చేస్తారని వ్యాఖ్యానిస్తూ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు.  

ఇదీ చంద్రబాబు అవినీతి నెట్‌వర్క్‌  
అటు అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాలు, టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఇటు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ రెండింట్లోనూ చంద్రబాబు ఒకే అవినీతి నెట్‌వర్క్‌ను ఉపయోగించారు. రెండుచోట్లా తానే సూత్రధారిగా ఉంటూ... నిధులను చేర్చడంలో పాత్రధారులుగా యోగేశ్‌ గుప్తా, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌లను పెట్టారు. అదెలాగంటే... 

► జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా దాని సహ భాగస్వామిగా డిజైన్‌ టెక్‌ కంపెనీని రంగంలోకి దింపి ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం చేశారు చంద్రబాబు. రూ.3,300 కోట్ల మేర కాగితాలపై ప్రాజెక్టును చూపించి డిజైన్‌ టెక్‌ సంస్థ తన వాటా 90 శాతంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 శాతం కింద జీఎస్టీతో సహా రూ.371 కోట్లు విడుదల చేశారు. అందులో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు రూ.56 కోట్లు చెల్లించి...  మిగిలిన రూ.315కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి తమ ఖాతాల్లోకి తరలించేసుకున్నారు. దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు నికంగా రూ.241 కోట్లు చేరాయని సిట్‌ నిర్ధారించింది.  

అక్రమ నిధుల ఎలా తరలించారంటే... 
► రాష్ట్ర ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371కోట్లు చెల్లించింది.  
► డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐకి రూ.2.71కోట్లు అంటే మొత్తం మీద రూ.241కోట్లు తరలించారు.  
► పీవీఎస్‌పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌లలో ఉన్న వివిధ షెల్‌ కంపెనీలతో పాటు దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... 

ఏసీఐ: రూ.56కోట్లు 
నాలెడ్జ్‌ పోడియమ్‌: రూ.45.28కోట్లు 
ఈటా: రూ.14.1 కోట్లు 
పాట్రిక్స్‌: రూ.3.13కోట్లు 
ఐటీ స్మిత్‌: రూ.3.13కోట్లు 
భారతీయ గ్లోబల్‌: రూ.3.13కోట్లు 
ఇన్‌వెబ్‌: రూ.1.56కోట్లు 
పోలారీస్‌: రూ.2.2కోట్లు 
కెడెన్స్‌ పార్టనర్స్‌: రూ.12కోట్లు 

► మొత్తం రూ. 140.53కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి యోగేశ్‌ గుప్తా మనోజ్‌ వాసేదేవ్‌ పార్థసానికి అందించారు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదును చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో అందించారు. అంటే ఆ రూ.140.53కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  

► ఇక మిగిలిన రూ.100.47కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులు మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అక్కడ నుంచి చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  

► అంటే ఏపీఎస్‌ఎస్‌డీసీకి చెందిన రూ.241కోట్లు అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement