పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో రూ.10.71 కోట్లు మాత్రమే పక్కదారి పట్టాయని, ఇందులో రూ.7.5 కోట్లు తిరిగి రాబట్టామని, ఇంకా రూ.3.66 కోట్లను రాబట్టాల్సి ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది.
♦ రూ.10.71 కోట్లే
♦ ‘సాక్షి’ వార్తపై పరిశ్రమల శాఖ వివరణ
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో రూ.10.71 కోట్లు మాత్రమే పక్కదారి పట్టాయని, ఇందులో రూ.7.5 కోట్లు తిరిగి రాబట్టామని, ఇంకా రూ.3.66 కోట్లను రాబట్టాల్సి ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ‘రావత్ అవుట్... మిశ్రాపై సీఎస్ సీరియస్’ పేరుతో ఈ నెల 7న ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆ శాఖ స్పందించింది. పారిశ్రామిక రాయితీల కింద రూ.1,990.52 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. ఇందులో కొన్ని తప్పుగా, మరికొన్ని ఇచ్చిన సంస్థలకే మళ్లీ ఇవ్వడం జరిగిందని పేర్కొంది.
వీటిని తిరిగి తెప్పించే క్రమంలో జాయింట్ డెరైక్టర్ రామిరెడ్డి బ్యాంకులో తప్పుడు ఖాతా సృష్టించి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర కూడా ఉందని, ఈ కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. దాదాపు రూ.100 కోట్ల వరకూ రాయితీ సొమ్ము పక్కదారి పట్టాయన్న ఆరోపణల్లో నిజం లేదని పరిశ్రమలశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.