
పుట్టగానే ఆధార్, బర్త్ సర్టిఫికెట్స్
శిశువు పుట్టగానే బర్త్, ఆధార్ సర్టిఫికెట్ల జారీ
ఇక ప్రత్యేకంగా దరఖాస్తు అవసరం లేదు
ఆస్పత్రి నుంచే అన్ని వివరాల సేకరణ
డిజిటల్ లాకర్‌లో నిక్షిప్తం
త్వరలో నగరంలో అమలుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు
సిటీబ్యూరో : తల్లి గర్భం నుంచి శిశువు భూమ్మీదకొచ్చి కళ్లు తెరవగానే బర్త్ సర్టిఫికెట్..ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లకుండానే ఒక ఆధార్ నెంబర్. పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే.. వాటి నమోదు కూడా... - అవును ఇది నిజమే...తల్లిదండ్రులకు శుభవార్తే. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుల కోసం కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా సులువైన పద్ధతిలో ఆస్పత్రి నుంచే ఈ రెండు పనులు పూర్తయ్యేలా జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. శిశువు జన్మించిన ఆస్పత్రి నుంచే కావాల్సిన వివరాలను సేకరించి ఆయా సర్టిఫికెట్లు జారీ చేసేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అతి త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బర్త్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, మీ- సేవ కేంద్రాలకు వెళ్లకుండా ఎక్కడి నుంచైనా ప్రజలు ఆన్‌లైన్‌నుంచే డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో మునిగిన జీహెచ్‌ఎంసీ.. ఐటీని మరింత విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ అదనపు సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో శిశువులు పుట్టగానే...వారి జనన వివరాల నమోదుతో బర్త్ సర్టిఫికెట్‌ను డిజిటల్ లాకర్‌లో ఉంచుతారు. దాంతోపాటే శిశువు ఫొటోను తీసి ఒక ఆధార్ నెంబర్‌ను కేటాయిస్తారు.
ఆధార్ నమోదుకు ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ తదితరమైనవి పిల్లలు ఎదిగాక తీయాల్సి ఉన్నందున, తాత్కాలికంగా శిశువు ఫొటో తీసి, శిశువు తల్లి లేదా తండ్రి ఆధార్‌నెంబర్‌కు అనుసంధానం చేసి డిజిటల్ లాకర్‌లో ఉంచుతారు. శిశువు పుట్టిన కొన్ని గంటల్లోనే వీటిని డిజిటల్ లాకర్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ నమోదుకు వివరాలు సేకరించే నిపుణులను ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. తొలుత ప్రయోగాత్మకంగా కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
దశల వారీగా వివిధ ఆస్పత్రులకు ఈ పథకాన్ని విస్తరింపచేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారా ఇకపై పిల్లల బర్త్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్‌ఎంసీ , మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటి కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనీ లేదు. దరఖాస్తు కూడా చేసుకోకుండానే బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌నమోదు, డిఫెక్ట్ సర్టిఫికెట్(పుట్టుకతో లోపాలున్న వారికి)లు సిద్ధం కానున్నాయి. ‘తెలంగాణ ప్రభుత్వ శిశు ఆధార్ ప్రాజెక్ట్’ (టీ శాప్)ను వినియోగించుకొని జీహెచ్‌ఎంసీ ఈ ఏర్పాట్లు చేయనుంది. ఇది నిజంగా కాబోయే తల్లిదండ్రులకు ఎంతో ఉపయుక్తమైన అంశంగా చెప్పొచ్చు.