మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో విద్యాసంస్థల ప్రతినిధుల భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో ఎంపీ వినోద్, డిప్యూటీ సీఎం కడియం
విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతాయి: సీఎం కేసీఆర్
ప్రైవేటు విద్యా సంస్థలను మూసేయడం మా ఉద్దేశం కాదు
విద్యార్థుల్లేకుండా కాలేజీలు నడిస్తే రాష్ట్రానికి చెడ్డపేరు
లోపాలన్నీ సవరించుకోండి.. కావాలంటే మూడేళ్లు సమయమిస్తాం
ఉపాధి, ఉద్యోగాలనిచ్చే కోర్సులు అందించాలి
ఉత్తమ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తామని వెల్లడి
ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం
విద్యా విధానం ఎలా ఉండాలో సిఫార్సులు చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోగస్ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల్లేకుండా కాలేజీలు నడపడం దారుణమైన విషయమని.. వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. విద్యార్థుల్లేకుండా కాలేజీలు నడపడం వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నడవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బోగస్ విద్యా సంస్థ ఒక్కటి కూడా ఉండవద్దని... బాగా నడిచే ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో విద్యా సంస్థలపై ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. అయితే ఈ విచారణలో వెలుగులోకి వచ్చే లోటుపాట్లను సవరించుకోవడానికి విద్యా సంస్థలకు అవకాశం కల్పిస్తామన్నారు.
కావాల్సినంత గడువు ఇస్తామని... భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాల్లో లోపాలను సవరించుకోవాలని సూచించారు. దీంతో లోపాల సవరణకు తమకు ఏడాది సమయం కావాలని విద్యా సంస్థల యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. దీంతో ఏడాది కాదు మూడేళ్ల సమయం ఇస్తామని, కానీ రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించే విద్యా వ్యవస్థ మాత్రమే ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం చెప్పారు. అత్యున్నత విద్యను అందించే ప్రక్రియలో ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరని వ్యాఖ్యానించారు.
‘పని’కొచ్చే కోర్సులు అందించండి..
రాష్ట్రంలోని విద్యా సంస్థలు శాస్త్రీయ ఆలోచన చేసి విద్యార్థులకు పని దొరికే కోర్సులు అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకున్నా... వేలం వెర్రిగా ఒకే కోర్సును విద్యార్థులంతా చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు.
విద్యా సంస్థలకు చేసే విద్యుత్ సరఫరాను వాణిజ్య కేటగిరీ నుంచి జనరల్ కేటగిరీకి మార్చడం, ఆస్తి పన్ను మినహాయింపు తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో విద్యా విధానం ఎలా ఉండాలి, ఏ కోర్సులు ఉండాలి, ఇంకా ఏ కాలేజీలు పెట్టుకోవాలి, విద్యార్థులకు ఇంకా ఏం చేయాలి, ప్రైవేటు విద్యా సంస్థలకు ఏం కావాలనే అంశాలపై విద్యా సంస్థల ప్రతినిధులు కూలంకషంగా చర్చించి.. ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలను కూడా కలుపుకొని తెలంగాణలో మంచి విద్యా విధానం తేవాలన్నదే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుదామని.. కోర్సులు, కాలేజీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.