ప్రజలే నోటిచ్చి ఓటేస్తారు..!
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇదే కానుక: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. సామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. నలభై ఏళ్ల కిందట జనతా పార్టీకి ప్రజలు నోటిచ్చి ఓటేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుంది. మా పార్టీ నల్లధనంతో ఓట్లు కొనుగోలు చేసేది కాదు. మా ప్రభుత్వానికి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఓ న్యూస్ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన సర్వే లో 78 శాతం ప్రజలు మోదీకి మద్దతు పలికా రు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు ఇది రెట్టింపు’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల తో ఆయన మాట్లాడుతూ.. ‘రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో ప్రజలు, కార్మిక వర్గాలకు కొంత అసౌకర్యం కలిగింది.
దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికుల నివాస ప్రాంతాలు, వ్యాపా ర సముదాయాలు, మార్కెట్ల వద్ద మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని విసృ్తతం చేస్తాం. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నాకు సమయమిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తా. నోట్ల రద్దు అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక నేపథ్యంలో స్వీకరించాలి. నల్లడబ్బును నిర్మూలిస్తే దేశ అభివృద్ధి మరింత పరుగులు పెడుతుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విషయాన్ని గమనించాలి’అని వివరించారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నోట్ల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచెంద్రారెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌కు అర్థమైంది.. అందుకే సహకరిస్తున్నారు..
నోట్ల రద్దు అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అర్థం చేసుకున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. ‘ప్రజల అసౌకర్యంపై కేసీఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానితో సమావేశమై చర్చించారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మోదీ హామీ ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నాతో కూడా మాట్లాడితే పరిస్థితి వివరించా. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కొంత తగ్గుతుందని పేర్కొన్నప్పటికీ.. ఇబ్బందులుండవని, కేంద్రం సహకరిస్తుందని వివరించా’అని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌లా అర్థం చేసుకుంటే సమస్యే ఉండదన్నారు. పాక్ నుంచి వచ్చే నల్లధనం తగ్గిందని, ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల నకిలీ నోట్లు దేశంలోకి వచ్చాయని చెప్పారు.