కుటుంబం చిన్నాభిన్నం! | banjara hills freak accident destruction victim's family | Sakshi
Sakshi News home page

కుటుంబం చిన్నాభిన్నం!

Published Sun, Jul 3 2016 4:21 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

కుటుంబం చిన్నాభిన్నం! - Sakshi

కుటుంబం చిన్నాభిన్నం!

- విషాదం నింపిన బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం
- మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
 
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అన్నదమ్ముల్లో ఒకరు మృతిచెందగా మరొకరిని జీవచ్ఛవం చేసింది. మృతుడి వదిన కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి మృత్యువుతో పోరాడి ఓడింది. ఇంటి పెద్దయిన తండ్రి వెన్నుపూస విరిగి బతుకు మంచానికే పరిమితమైంది. కోలుకోని దెబ్బతీసిన ఈ దారుణం వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.  

ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం
శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెం.3లో పమ్మి రాజేష్(34) కారులో వెళుతుండగా పంజగుట్ట శ్మశానవాటిక వద్ద ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో జోగుతున్న యువకుడు వేగంగా కారు నడపడంతో, అది అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి రాజేష్ కారుపై పడింది. ఇందులో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందారు. పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోదా ఆస్పత్రిలో చేర్చారు. వెనకాల కూర్చున్న చిన్నారి రమ్య(8) తీవ్ర గాయాలై కేర్‌లో చికత్స పొందుతూ శనివారం మృత్యుఒడికి చేరింది.

పక్కనే కూర్చుని తన గారాల బిడ్డ తొలి రోజు బడి కబుర్లు వింటూ మురిసిపోతున్న తల్లి రాధిక(32) కుడి కాలు విరిగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి మరో సోదరుడు రమేష్ వెన్నెముక విరిగి ఆసుపత్రి పాల య్యారు. రాజేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరేం దుకు ఆదివారం అమెరికా పయనమవ్వాల్సిన శుభతరుణంలో చోటు చేసుకున్న ఈ ఘోరం కుటుంబం మొత్తాన్నీ విషాదంలో ముంచింది.

మధుసూదనాచారికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటరమణ కూతురు రమ్య సికింద్రాబాద్ సెయింట్‌ఆన్స్ స్కూల్‌లో సీటు రావడంతో శుక్రవారం మొదటి రోజు హాజరైంది. ఉదయం స్కూల్‌లో కూతురిని దించి అక్కడే ఒక ఇల్లు చూసి వచ్చిన తండ్రి వెంకటరమణ... పాపను తీసుకుని వచ్చే క్రమంలో ఆ ఇల్లును చూసిరావాలంటూ తమ్ముడు రాజేష్, భార్య రాధిక, తండ్రి మధుసూదనాచారికి చెప్పారు. మారేడ్‌పల్లిలో ఇల్లు చూసి దారిలో రమ్యను ఎక్కించుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నిందితుడి అరెస్ట్...
రోడ్డు ప్రమాదానికి కారకుడైన బీటెక్ విద్యార్థి షవెల్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 304(పార్ట్-2) కింద కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం సేవించి అదుపుతప్పిన వేగంతో కారు నడుపుతూ ఈ ప్రమాదానికి కారకుడైనట్లు పోలీసులు తెలిపారు. షవెల్‌తోపాటు ఎన్.సూర్య, విష్ణు, అశ్విన్, సాయి రమేష్, అలెన్ జోసెఫ్ ఈ కారులో ఉన్నారు. బంజారాహిల్స్ సినీ మ్యాక్స్‌లోని టీజీఐ ఫ్రైడేస్‌లో మద్యం సేవించి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థుల రక్త నమూనాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement