ఆ రెండు కేసుల ఆధారంగా దర్యాప్తు | Based on the investigation of the two cases | Sakshi
Sakshi News home page

ఆ రెండు కేసుల ఆధారంగా దర్యాప్తు

Published Tue, Mar 29 2016 2:26 AM | Last Updated on Mon, May 28 2018 3:04 PM

ఆ రెండు కేసుల ఆధారంగా దర్యాప్తు - Sakshi

ఆ రెండు కేసుల ఆధారంగా దర్యాప్తు

♦ 16,857 ఎకరాలు.. 82,707 ఇళ్ల స్థలాలను గుర్తించాం
♦ ఏప్రిల్, మేలో ఆస్తుల వేలం అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో
♦ హోం మంత్రి చినరాజప్ప వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నమోదైన కేసుల ఆధారంగానే అగ్రిగోల్డ్ సంస్థపై దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు అగ్రిగోల్డ్‌పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై ఆయన స్టేట్‌మెంట్ చదివి వినిపించారు. 1995-2004 మధ్య అగ్రిగోల్డ్ ఆస్తులు విలువ రూ.100 కోట్లు.. 2004-2014 మధ్య రూ.వేల కోట్లకు చేరిందని అన్నారు. అగ్రిగోల్డ్ కేసును 2015 జనవరి 5న సీఐడీకి అప్పగించామని పేర్కొన్నారు. ఆ సంస్థ ఇప్పటివరకూ రూ.6,873 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. అగ్రిగోల్డ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు 16,857 ఎకరాల భూమి, 82,707 ఇళ్ల స్థలాలను గుర్తించామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్, మే నెలల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయనున్నట్లు చినరాజప్ప తెలిపారు.

 మీరు బాధ్యత తీసుకుంటే సీబీఐకి ఇస్తాం: అచ్చెన్నాయుడు
 అగ్రిగోల్డ్ బాధితుల న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అగ్రిగోల్డ్‌పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అచ్చెన్నాయుడు పదేపదే అడ్డు తగిలారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తే జాప్యం జరుగుతుందని, అందుకే సీఐడీతో విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ‘‘జాప్యం జరిగినా ఫరవాలేదని మీరు బాధితుల తరఫున బాధ్యత వహిస్తే, మేము సీబీఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన అన్ని ఆస్తులు అటాచ్‌మెంట్‌లు ఎందుకు లేవన్న ప్రతిపక్ష నేత ప్రశ్నకు.. మా దగ్గర వివరాలున్న మేరకు ఆస్తులను అటాచ్ చేశాం, మీ దగ్గర ఇంకా వివరాలుంటే మాకివ్వండి, వాటిని అటాచ్ చేస్తాం అని మంత్రి బదులిచ్చారు.

 డిపాజిట్లు కాదు డ్యూస్ అని చెప్పా: యనమల
 అగ్రిగోల్డ్‌కు సంబంధించి రూ.570 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని డెక్కన్ క్రానికల్ రిపోర్టర్‌తో తాను చెప్పలేదని, డ్యూస్ ఉన్నాయని మాత్రమే చెప్పానని ఆర్థిక శాఖ మంత్రి యనమల అసెంబ్లీకి వివరణ ఇచ్చారు. విపక్ష నేత వైఎస్ జగన్ డెక్కన్ క్రానికల్‌లో మంత్రి మాట్లాడినట్లు వచ్చిన వార్తను సభలో చదివి నిపించారు. దీనిపై మంత్రి యనమల స్పందించారు. తాను డ్యూస్ ఉన్నాయని చెప్పానని, ఎక్కడా డిపాజిట్లు ఉన్నాయని చెప్పలేదని అన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ...డ్యూస్ అని చెప్పి ఉంటే, ఆ రోజు ఎందుకు ఖండించలేదని, అలా చేయలేదంటే ఆయన డిపాజిట్లు ఉన్నాయని చెప్పినట్లే కదా అని అన్నారు.
 
 14 ఎకరాలు కొన్నది నిజమే: ప్రత్తిపాటి
 తన భార్య వెంకాయమ్మ పేరుతో 14 ఎకరాలు కొన్నది నిజమేనని, అయితే ఆ ఆస్తులు ఎలాంటి అటాచ్‌మెంట్‌లో లేవని మంత్రి ప్రతిపాటి పుల్లారావు సోమవారం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే కొన్నామని, అటాచ్‌మెంట్‌లో లేని ఆస్తులు కొనకూడదా? అని ప్రశ్నించారు. తన భార్య కొన్న భూములకు అగ్రిగోల్డ్‌తో ఎలాంటి సంబంధం ఆ భూములన్నింటినీ వదిలేస్తానని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందిస్తూ... అవి ఎందుకు అటాచ్‌మెంట్‌లో లేవన్నదే తమ అనుమానమని, ఇప్పటికైనా మంత్రి భూములు కొన్నట్లు ఒప్పుకోవడం సంతోషకరమని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement