ఈ బ్రహ్మచారి.. మహా చిలిపి గురూ!
బ్యాచిలర్ లైఫ్ అనగానే అబ్బ అంతకుమించిన లైఫ్ జీవితంలో ఇంకోటి లేదనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. సరే.. బయటికి కనిపించే జీవితం ఒకటైతే, ఒంటరి జీవితంలోని అనుభవాలు ఇంకో రకం. బ్యాచిలర్ లైఫ్ అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది బ్యాచిలర్ రూం. ఎక్కడపడితే అక్కడ పడి ఉండే దుస్తులు, గోడల నిండుగా సగం దుస్తుల హీరోయిన్‌ల ఫొటోలు.. లాంటివి సహజంగానే అందరికీ గుర్తొస్తాయి. అంతే కాదు బ్రహ్మచారి గది.. ఇన్నోవేషన్‌కు పెన్నిధి అని కూడా చెప్పొచ్చు. ఒక వస్తువును ఎంత విభిన్నంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు? అనేది నేర్పే ట్రైనింగ్ సెంటర్ కూడా.
చెప్పలేనన్ని...
స్టవ్ అవసరమే లేనట్టు పుస్తకాల మధ్యలో ఐరన్ బాక్స్ పెట్టి టీ కాచుకోవడం, చపాతీలు కాల్చటం, బీర్ బాటిల్‌ని చపాతీ రోలర్‌గా ఉపయోగించడం, కూలర్‌ని ఫ్రిజ్‌లా ఉపయోగించుకోవచ్చు అనేట్టుగా కూల్‌డ్రింక్ బాటిల్స్‌ని కూలర్ దగ్గరగా కట్టడం.. ఇలా ఒకటీ రెండు కాదు ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు మనం నగరంలోని బ్రహ్మచారుల గదుల్లో చూడొచ్చు. సదరు ఉత్పత్తి తయారీదారు సైతం విస్తుపోయేలా వస్తువులను వినియోగిస్తున్నారు వీరు.
ఏకాంతం లేని బంధువుల గృహాలు, ఫుడ్ నచ్చని హాస్టళ్లలో ఉండడం నచ్చని బ్యాచిలర్స్ ఏదైతే అదైందని తెగించి సెపరేట్‌గా ఒక రూం తీసుకొని, సొంతంగా ఫుడ్ వండుకొని తినడం అలవాటు చేసుకున్నారు. ఇంకేంటి అంతా హ్యాపీయే కదా అనుకుంటున్నారేమో..? కానీ ఇందులో ఒక కిటుకు ఉంది. ఇలాంటి సెపరేట్ రూమ్‌లలో బ్యాచిలర్స్ చేసే అద్భుతాలు, ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అందులో కొన్నింటిని ఉదాహరణకి తీసుకుందాం.
స్వయంగా వంట చేసుకుంటే కాస్తా ఉప్పు కారం అటు ఇటు అయినా రుచిగానే ఉంటుంది. కానీ అందుకు అవసరమయ్యే కిచెన్ సామగ్రి కొని తెచ్చుకొని సెట్ చేసుకునేంత ఓపిక మాకు ఉండదు. పైగా చదువు, ఉద్యోగమని ఎప్పుడంటే అప్పుడు రూమ్స్ మారుతూ ఉంటాం. షిఫ్టింగ్‌కు భారంగా ఉంటుందని ఎక్కువ సామగ్రి కొని పెట్టుకోం. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే వస్తువులతోనే రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. ఇలా చేసినప్పుడు అప్పుడప్పుడు ఇబ్బందులు తప్పవనుకోండి.. కానీ ఇదొక లైఫ్ స్టైల్.
- శివ, బ్యాచిలర్(ఉద్యోగి)
వినియోగానికి కాదేదీ అనర్హం..
పని జరగడం ముఖ్యం. దేనిని దేనికి వాడితే ఏమవుతుంది? ఇదీ బ్యాచిలర్స్ రూమ్‌లలో ‘బ్రహ్మ’ సూత్రం. కాదేదీ వినియోగానికి అనర్హం.. అన్న రేంజ్‌లో ఉంటుంది వీరి వాడకం. పోపుల డబ్బాను ఉల్లిపాయలతో నింపడం లాంటి సాధారణ ప్రయోగాలతో మొదలుపెట్టి.. హెల్మెట్‌ను కోడిగుడ్ల పెట్టెలాగ, కంప్యూటర్ సీపీయూని గోడకు వేలాడదీసి స్పూన్‌లు, గరిటెలు.. తదితరాలుంచే కిచెన్ స్టాండ్‌లా, ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు రాకుండా హెల్మెట్ ధరించడం లాంటి భయంకర ప్రయోగాలూ సిటీలోని బ్యాచిలర్ లైఫ్ స్టైల్.