బీబీనగర్ నిమ్స్‌ను ఏం చేద్దాం?
వైద్య కళాశాలా?.. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూటా?
మూడు ప్రతిపాదనలతో సీఎం వద్దకు ఫైలు
తాజా బడ్జెట్‌లో రూ.కోటితో సరిపెట్టిన వైనం
సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న బీబీనగర్ నిమ్స్‌పై మళ్లీ సందిగ్ధం నెలకొంది. 150 ఎకరాల విస్తీర్ణం గల ఈ క్యాంపస్‌ను,అందులో నిర్మించిన భవనాలను వైద్య కళాశాలకు అప్పగించాలా..? క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు కేటాయించాలా..? లేక ముందుగా అనుకున్నట్టు జనరల్ ఆస్పత్రినే కొనసాగించాలా..? అనే దానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు చేరినట్టు సమాచారం. ఈ భవనాలను ఏం చేయాలనే అంశంపై పూర్తి నిర్ణయాధికారాన్ని సీఎంకే వదిలేసినట్టు సమాచారం. తాజా బడ్జెట్‌లో దీనికి పెద్దగా కేటాయింపులు జరపకపోవడం వెనుక ఇదే కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఓపీకి అంతా సిద్ధమైనా..
బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తులు నిమ్స్ భవనం పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దివంగత సీఎం వైస్ రాజశేఖరరెడ్డి 2009లో దీనికి శంకుస్థాపన చేశారు. ఇటీవలే ఓపీ భవనం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కాకపోయినా తొలిదశలో భాగంగా ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలు, అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్‌ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులు, ప్రాథమిక అవసరాల కోసం 700 మంది నర్సింగ్, పారామెడికిల్, నాన్ పారామెడికల్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. తీరా ప్రారంభ సమయంలో దీనిపై సీఎం కేసీఆర్‌కు మూడు ప్రతిపాదనలు అందాయి.
తాజా ప్రతిపాదనలు ఇలా..
ప్రస్తుతం రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. దీన్ని బీబీనగర్‌కు తరలించి క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి అక్కడే వైద్యసేవలు అందించాల నే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. లేదంటే తెలంగాణకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి ఈ క్యాంపస్‌ను కేటాయించడం వల్ల గ్రామీణ విద్యార్థులకు వైద్యవిద్యను దగ్గర చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని యోచిస్తోంది. ఈ రెండు కాకపోతే స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా జిల్లాలో మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఏదేమైనా సకాలంలో సేవలు అందుబాటులోకి వస్తే భువనగిరి డివిజన్‌తోపాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.
ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా బీబీనగర్ నిమ్స్‌పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేటని పీసీసీ నాయకుడు చామల ఉదయ్ చందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఆస్పత్రి భవనాన్ని వెంటనే ప్రారంభించి, స్థానికులకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.