=నగరంలో ప్లాస్టిక్ సర్జరీలపై పెరుగుతున్న మోజు
=సొట్టబుగ్గలు, నడుము, చాతీ చికిత్సలపై అమ్మాయిల ఆసక్తి
=ముక్కు, బట్టతల, పొట్టను సరిచేసుకుంటున్న అబ్బాయిలు
సాక్షి, సిటీబ్యూరో : అందాలను సమకూర్చుకోవడం... ఆకర్షణను ద్విగుణీకృతం చేసుకోవడం అమ్మాయిల్లో మామూలే. ఇప్పుడా జాబితాలో సొగసుల సోగ్గాళ్లూ చేరిపోతున్నారు. ‘అందం అమ్మాయిల సొత్తేనా? మాకూ కావాలి’ అంటూ కత్తిగాట్లకు సిద్ధమవుతున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థటిక్ ప్లాస్టిక్ సర్జరీ సర్వే ప్రకారం గతేడాది ప్లాస్టిక్ సర్జరీల్లో మన దేశానిది నాలుగో స్థానం. అందాలకు మెరుగులు దిద్దుకోవాలని కిందటేడాది భారత్‌లో శస్త్రచికిత్సలకు క్యూ కట్టిన వారి సంఖ్య 8,94,700 మంది. వీరిలో 20-25 శాతం మంది మన హైదరాబాదీయులే ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ ప్లాస్టిక్ సర్జరీల కల్చర్ తాజాగా
మధ్యతరగతి వారినీ విశేషంగా ఆకర్షిస్తోంది.
ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదాలు, సొట్ట బుగ్గలు, చాతీ, నడుము కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా హేళన తప్పదు. అనుభవించేందుకు కావలసినంత ఐశ్యర్యమున్నా... చూసేందుకు కంటికి ఇంపుగా కన్పించకపోతే ఏదో తెలియని వెలితి వెంటాడుతూనే ఉంటుంది. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిచయం ఉన్న ఈ ప్లాస్టిక్ సర్జరీలు నేడు సామాన్యులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఎదుటి వారి దృష్టిని ఇట్టే ఆకర్షించేందుకు ప్లాస్టిక్ సర్జరీలతో తమ ఆకృతిని మార్చుకుని సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్న యువతీ, యువకుల సంఖ్య నగరంలో రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఫలిత ంగా సిటీలో ప్లాస్టిక్ సర్జరీలు చేసే ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాము అందంగా తీర్చిదిద్దుతామంటే...తామే అందంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మగవాళ్లు మ్యాన్‌బూబ్స్, బట్టతలను సరి చేసుకుంటుంటే, ఆడవారు ముక్కు, బుగ్గలు, ముఖంపై ముడుతల్ని సరిచేయించుకుంటున్నారు.
కోటేరు లాంటి ముక్కు కోసం...
ముఖం అందాన్ని నిర్ణయించేది ముక్కు. ముక్కు ఎంత కొంచెంగా ఉంటే అంత అందంగా కన్పిస్తుంటారు. అయితే చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా కన్పించేందుకు రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ చేయించుకుంటున్న వారిలో 70 శాతం అమ్మాయిలు ఉంటే, 30 శాతం అబ్బాయిలు ఉన్నారు. ఇందుకోసం సర్జరీ చేయించుకునే వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఒకవేళ ఆ కణజాలం వారికి సరిపోకపోతే రక్త సంబంధీకుల నుంచి సేకరించి అమర్చుతున్నట్లు కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఈఎన్‌టీ, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి చెప్పారు. ఇలా నగరంలో నెలకు 10-15 సర్జరీలు జరుగుతున్నట్లు సమాచారం.
నాజుకైన నడుము కోసం..
శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ఁఅధిక బరువుగారూ.భావిస్తారు. ఇది ఒక జబ్బు కాకపోవచ్చు కానీ, అనేక ఇతర జబ్బులకు కారణం అవుతోంది. మధ్యతరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధపడుతున్నట్లు ఓ అంచనా. ఓ సర్వే ప్రకారం 2005లో నగరంలో ఈ సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం ఇది 10 శాతానికి చేరుకుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొలగిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే... ల్యా ప్రోస్కోపిక్ సహాయంతో చేసే బెరియాట్రిక్ సర్జరీలను మధ్యతరగతి వాళ్లు ఆశ్రయిస్తున్నట్లు లివ్‌లైఫ్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ బె రియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ చెప్పారు. ఇలా నగరంలో ప్రతి నెలా 70-80 బెరియాట్రిక్ సర్జరీలు జరుగుతున్నట్లు సమాచారం.
మచ్చుకు కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు...
రైనోప్లాస్టీ: అందమైన నాసిక కావాలనుకునే వారి చాయిస్. చప్పిడి ముక్కు, వంకరలు తిరిగిన ముక్కును సరి చేయవచ్చు
బొటాక్స్: ముఖంపై ముడుతలు పోవడానికి చక్కని పరిష్కారం. 30 దాటిన వారు బొటాక్స్ కోసం పరుగులు తీస్తున్నారు
లైపోసక్షన్: పొట్ట, నడుము భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించేందుకు వాడే శస్త్రచికిత్స
డింపుల్స్ క్రియోషన్స్ సర్జరీ: నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టపడేలా చేస్తారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్: బట్టతలపై వెంట్రుకలను మొలిపిస్తారు.
చీక్ అగ్మంటేషన్: ఆకట్టుకునే ముఖాకృతి కోసం చేసే సర్జరీ
గైనకో మాస్టియా: అమ్మాయిల్లా పెరిగిపోయిన మ్యాన్‌బూబ్స్ తొలగించే శస్త్రచికిత్స
టమ్మీటక్: పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సిక్స్‌ప్యాక్‌లకు దారి చూపుతుంది
బ్లైఫరోప్లాస్టీ : నాజుకైన కంటిరెప్పల కేరాఫ్ అడ్రస్ ఇది
విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
ప్లాస్టిక్ సర్జరీతో తక్కువ ఖర్చుతో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత సైతం ఇటీవల ఇక్కడికే వస్తున్నారు. నిపుణులు అందుబాటులో ఉండటం, సర్జరీల ఖర్చు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న వారిలో 70 శాతం మంది అమ్మాయిలుంటే, 30 శాతం మంది అబ్బాయిలున్నారు. వీరిలో 80 శాతం పెళ్లికి ముందే చేయించుకుంటున్నారు.
- డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్
30 ఏళ్లలోపు వారే ఎక్కువ
అందం బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. ఆధునిక తరం ఈ విషయాన్ని తొందరగా గ్రహించింది. ప్రతి ఒక్కరూ అందాలను మెరుగు దిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తీరైన శరీరాకృతి కోసం సర్జరీలు చేయించుకుంటున్న వారిలో 90 శాతం మంది 30 ఏళ్లలోపు వారే.
- డాక్టర్ నందకిషోర్, లివ్‌లైఫ్ హాస్పిటల్
అందాల క్రేజ్
Published Sun, Nov 24 2013 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement