
'సెటిలర్లకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ రాజకీయాలు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం హైదరాబాద్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... టీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉగ్రవాదానికి తెర తీసిందని ఆరోపించారు. ఆ ధీమాతోనే ఈ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ సెటిలర్లకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పేరు మారుస్తామని చెప్పి... అంతలోనే ఓ జోకర్లా మారారని తెలంగాణ ఐటీ, పంచయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను ఎద్దేవా చేశారు. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీకి కోపం వస్తుందనే... సీఎం కేసీఆర్ హెచ్సీయూకు వెళ్లలేదన్నారు. ఇతర పార్టీ నేతలను తన అధికారంతో టీఆర్ఎస్ లోబర్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని సైతం టీఆర్ఎస్ అడ్డుకుందని విమర్శించారు. ఎంఐఎం, బీజేపీలు మతతత్వ పార్టీలని భట్టి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీల వల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రమాదంలో పడిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఈ మూడు పార్టీలు తమ ద్వేషపూరిత విధానాన్ని తీవ్రతరం చేస్తాయన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు పరస్పరం అవగాహనతో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు.