'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర' | Bhumana Karunakar Reddy Suspected Chandrababu Comments | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర'

Published Mon, May 30 2016 12:42 PM | Last Updated on Sat, Aug 11 2018 4:28 PM

'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర' - Sakshi

'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర'

హైదరాబాద్: మూడు రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణతో మారుమోగిందని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నయవంచన, అవినీతి బయటపడుతుందనే జగన్ పై విమర్శలు చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భూమన విలేకరులతో మాట్లాడారు. వేంకటేశ్వరస్వామికి వైభవం తెచ్చింది తానే అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారని, ఆయన మాటలతో అన్నమయ్య మరగుజ్జుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధార్మికతపై చంద్రబాబు చావు దెబ్బ కొట్టారన్నారు. భగవంతుడి పట్ల దారుణమైన అపచారం తెచ్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామనడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిని నిరూపిస్తే జైలుకు వెళ్తానని చెబుతున్న లోకేశ్ కు తన తండ్రి ఓటుకు కోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. లోకేశ్ బాబును సూట్ కేసు బాబుగా రాష్ట్రం పిలుచుకుంటోందని చెప్పారు. చంద్రబాబు కార్యాలయం, ఇంట్లో సీసీ కెమెరాలు పెడితే ఆయన బాగోతాలు ప్రజలందరికీ తెలుస్తాయన్నారు. మహానాడులో మూడు రోజుల పాటు పచ్చి బూతులు మాట్లాడారని అన్నారు. వంగవీటి రంగా హత్యకు కారకుడైన చంద్రబాబు హత్యారాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబే హంతకుడని రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

కుల రాజకీయాలు, కులపిచ్చితో చంద్రబాబు పైకి వచ్చారన్నారు. తనకున్న కులపిచ్చిని ఎస్వీయూ అంతకీ వ్యాపింపచేశారని దుయ్యబట్టారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరన్నారు. అవసరమైతే ఎవరి కాళైన పట్టుకునే అమీబా జాతి వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. త్వరలో వైఎస్సార్ సీపీ ఖాళీ అవుతుందన్న ఆయన మాటల వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ను భౌతికంగా నిర్మూలించడానికి చంద్రబాబు కుట్ర పన్నినట్టు అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్ చనిపోవడానికి ఒకరోజు ముందు చంద్రబాబు అన్నమాటలు మనకు ఇంకా గుర్తు ఉన్నాయని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లు ఇస్తారట అని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement