
జగన్ వ్యక్తిత్వమే మా ఆస్తి
- వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
- వైఎస్ జగన్‌ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, హైదరాబాద్: మహానాడులో టీడీపీ నేతలుజగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మాట్లాడారని, అయితే ఆ వ్యక్తిత్వమే తమకు ఆస్తి అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబులా గా అధికారం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే అమీబాలాంటి వ్యక్తి తమ జగన్ కాదని చెప్పారు. ‘మా జగన్‌లో నిబద్ధత ఉంది. పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి ఉన్నాయి. ఎవరికీ తలవంచని నైజం మా నాయకుడిది. చంద్రబాబులాగా అమీబా కాదు మా నేత. ఒళ్లంతా వెన్నెముక, ధైర్యం, దేహమంతా గుండె కలిగినవాడు మా జగన్ అని’ భూమన అన్నారు. చంద్రబాబును తాను విద్యార్థి దశ నుంచీ ఎరుగుదునని.. ఆయనకున్నంత కులగ జ్జి, డబ్బు మీద వ్యామోహం మరొకరికి లేవని అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయి, తనపై చార్జిషీటు దాఖలు చేసినా.. కేసీఆర్, మోదీ కాళ్లు పట్టుకొని జైలుకు పోకుండా తప్పించుకున్న సమర్థత చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు.
ఆటవిక జాతరలా సాగిన మహానాడు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడులో మాట్లాడిన తీరు చూస్తుంటే తమ నాయకుడు ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భౌతికంగా నిర్మూలించే కుట్ర జరుగుతోంద నే అనుమానం ప్రజలకు కలుగుతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఒక రాజకీయ పార్టీ మహాసభలాగా కాకుండా ఆదిమానవులు ఆటవిక జాతరలాగా సాగిన ఈ మహానాడులో వైఎస్సార్‌సీపీ తొందరలోనే ఖాళీ అయిపోతుందని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి ఈ అనుమానం బలపడుతోందని చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ఒక్క రోజు ముందు కూడా ఎవరు ఫినిష్ అవుతారో త్వరలో తెలుస్తుందని చంద్రబాబు అన్న మాటలు తమకింకా గింగురుమంటున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందునే జగన్‌పై మహానాడులో సీఎం విమర్శలు చేయించారని భూమన అన్నారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేతగా నూటికి నూరు శాతం జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతం అయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
లోకేశ్‌ను సూట్‌కేసు బాబు అంటున్నారు
చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబు అవినీతి కార్యకలాపాలను చూసి ఆయన్ను సూట్‌కేస్ బాబుగా ప్రజలు పిలుచుకుంటున్నారని భూమన ఎద్దేవా చేశారు.
కలియుగదైవానికి వైభవం తెచ్చింది నువ్వా
కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి వైభవాన్ని తెచ్చింది తామేనని టీడీపీ పీఠాధిపతి, పరమపూజ్య, పరమహంస, పరివ్రాజక శ్రీశ్రీశ్రీ నారా చంద్రబాబా స్వామి వారు చెప్పుకోవడం ఆయన స్వోత్కర్ష శృతి మించినదనడానికి నిదర్శనమని భూమన ఎద్దేవా చేశారు.ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే నని అన్నారు.