
కోతలకు అన్న... చేతలకు సున్నా
చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
సాక్షి,హైదరాబాద్: సీఎం చంద్రబాబు పాలన కోతలకు అన్న.. చేతలకు సున్నాలా ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. బాబు చెప్పేది అభివృద్ధి మంత్రం, చేసేది అవినీతి తంత్రమని విమర్శించారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను వ్యతిరేకిస్తే పోలీసులతో తొక్కేయగలననే అహంతో బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఒక్క హామీనైనా నెరవేర్చారా?
‘‘ప్రజల జీవితాలను సంపూర్ణంగా మార్చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన 600లకు పైగా హామీల్లో ఒక్కటి కూడా బాబు నెరవేర్చలేదు. రుణాలను మాఫీ చేస్తానని ఓట్లు దండుకొని రైతులు, డ్వాక్రా మహిళలను వంచించాడు. ప్రయాణికులు లేకున్నా విమానాలు తిప్పండి అంటూ యజమానులకు రూ.కోట్ల కొద్ది డబ్బులు కుమ్మరిస్తున్నాడు. కానీ, రైతులు కన్నీళ్లు పెట్టుకొని అల్లాడుతుంటే వారికి ఒక్క రూపాయి సహాయం చేసేందుకైనా చంద్రబాబుకు మనస్సు రావడం లేదు. హామీలు నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలాడుతున్న చంద్రబాబుని అబద్ధాసురుడు అనవచ్చు. నిరుద్యోగ యువత సంఘాలుగా ఏర్పడి మోసపూరిత పాలనపై పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.’’ అని భూమన ధ్వజమెత్తారు.
బికినీల పండుగ ఎవరి కోసం బాబూ?
‘‘మహాకవులు, రచయితలకు నిలయమైన విశాఖపట్నంలో బికినీల పండుగ చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఎవరి కోసం ఈ బికినీల పండుగ? చంద్రబాబు అనాలో, బికినీ బాబు అనాలో అర్థం కావడం లేదు. పాశ్చాత్య విష సంస్కృతిని ప్రవేశపెట్టడానికే చంద్రబాబు బికినీ ఫెస్టివల్ తలపెట్టారు’’ అని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు.