
ఏపీ నుంచి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. సోమవారం బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ఓ రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, సురేష్ ప్రభుకు అవకాశం కల్పించారు. సురేష్ ప్రభు ఈ రోజు రాత్రి హైదరాబాద్కు చేరుకుని, రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా మహారాష్ట్ర నుంచి వినయ్ సహస్త్ర బుద్ధే, వికాస్ మహాత్మే, మధ్యప్రదేశ్ నుంచి ఎంజే అక్బర్, ఉత్తరప్రదేశ్ నుంచి శివప్రసాద్ శుక్లా, జార్ఖండ్ నుంచి మహేష్ పొద్దార్ను ఎంపిక చేశారు. ఏపీ నుంచి సురేష్ ప్రభు పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ నుంచి సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వెంకయ్య నాయుడు రాజస్థాన్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఇతర మంత్రులు తన పేరును ప్రతిపాదించినట్టు ట్విట్టర్లో తెలియజేశారు.