బీజేపీ రాష్ట్ర సారథి ఎంపికపై కసరత్తు
రెండు రోజుల్లో అధినాయకత్వానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి నివేదిక
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక కోసం పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కృష్ణదాసు రెండురోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేశారు. బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులు, ముఖ్యనాయకులు, జిల్లాల అధ్యక్షులతో కృష్ణదాసు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. వీరి నుంచి సేకరించిన అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారు.
రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత బలం, బలహీనత, రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీ బలోపేతం కావడానికి అనుసరించాల్సిన వ్యూహం, సామాజిక వర్గం, ఆర్థిక బలం, సమన్వయం చేసుకునే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా ఆయన అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎంపికయ్యే రాష్ట్ర అధ్యక్షుని పదవీ కాలంలోనే 2019లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుడిని ఎంపిక చేయాలని రాష్ట్రనేతలు నివేదించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొందరు నేతలు రాష్ట్ర అధ్యక్షుని పదవికోసం నేరుగా పేర్లు సూచించగా, మరికొందరు అధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలను చెప్పి, నిర్ణయా న్ని అధిష్టానానికే వదలి పెట్టారని తెలిసింది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మరో నేత పేరాల చంద్రశేఖర్‌రావు పేర్లు అధ్యక్ష పదవి కోసం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అధ్యక్ష పదవిని స్వీకరించడానికి మురళీధర్‌రావు, లక్ష్మణ్ నిరాసక్తతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేరు ప్రముఖంగా వినబడుతోంది. పార్టీ రాష్ట్ర నేతల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి కృష్ణదాసు మరో రెండు రోజుల్లో జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారని తెలిసింది. అయితే పార్టీ రాష్ట్ర నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా అంతిమంగా జాతీయ నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ల నిర్ణయమే కీలకం కానుంది. ఈ నెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలోగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.