రక్తం చిందిన రాత్రి
►స్థల వివాదంలో ఘర్షణ
►ఇనుపరాడ్లు, సిమెంటు దిమ్మెలతో దాడి
►నలుగురికి తీవ్ర గాయాలు
►ఒకరి పరిస్థితి విషమం
నాగోలు: హైదరాబాద్ నడి బొడ్డున స్థల సరిహద్దు విషయంలో ఏర్పడిన వివాదంలో ఓ వర్గం వారు ప్లాట్ల యజమానులపై ఒక్కసారిగా ఇనుపరాడ్లు, రాళ్ళతో దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఎల్‌బీనగర్ సీఐ కాశిరెడ్డి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నాగోలు స్నేహపురికాలనీకి చెందిన అనంతుల వీరారెడ్డి 1998–99లో జైపురికాలనీ, మల్లికార్జునహిల్స్‌లో సర్వే నెం–87/1లో వెంచర్ చేసి ప్లాట్లను విక్రయించాడు. దీని పక్కనే ఉన్న నాగోలు గ్రామానికి చెందిన ఝెగ్గే భిక్షపతి, ఝెగ్గే రాములు, దానయ్యలకు సర్వే నెం–77లో కొంత స్థలం ఉంది.
వీరి మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. దీంతో వీరారెడ్డి ఏడీ సర్వే రిపోర్ట్ తెప్పించుకోగా తనకు అనుకూలంగా రావడంతో వారం రోజుల నుంచి సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. కాగా ఈ స్థలాన్ని ఝెగ్గే భిక్షపతి కుటుంబ సభ్యులు కొర్రెములకు చెందిన బైర రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌కు విక్రయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, ఝెగ్గే భిక్షపతి కుటుంబ సభ్యులు 20 మంది రెండు వాహనాల్లో ప్లాట్ల వద్దకు వచ్చి కాపలా ఉన్న కిరణ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, యాదయ్య, సుధాకర్, మధుగౌడ్‌లపై ఇనుపరాడ్లు, సిమెంటు ఇటుక పెళ్లలతో దాడి చేశారు. అనంతరం అక్కడే ఉన్న మంటల్లో రవిందర్‌రెడ్డిని వేశారు. ప్లాట్ల యజమానులకు చెందిన రెండు కార్లను ధ్వంసం చేశారు. స్థానికులు ఒక్కసారిగా బయటకు రావడంతో వారు పారిపోయారు. బాధితులను అంబులె ఆసుపత్రికి తరలించారు. రవిందర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, ఝెగ్గే భిక్షపతి, దానయ్య, శివశంకర్, జంగయ్య, మహేష్, సురేష్, కొత్త నవీన్, ఝెగ్గే శంకర్‌లను అరెస్ట్ చేసి హత్యాయత్నం, దొమ్మి, అక్రమంగా స్థలంలోకి ప్రవేశించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రాములుగౌడ్‌పై ఘట్‌కేసర్, ఉప్పల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హత్య చేయడానికే కుట్ర: అనంతుల వీరారెడ్డి....
భిక్షపతికి చెందిన స్థలాన్ని అమ్ముకుని కావాలనే నా స్థలంలోకి వచ్చి దాడులు చేస్తున్నారని గతంలో కూడా నయీం అనుచరులతో బెదిరించారని లే అవుట్ యజమాని అయిన అనంతుల వీరారెడ్డి పేర్కొన్నారు. సంతోష్‌నగర్ వినయ్‌నగర్‌కాలనీలో కొల ఆనంద్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లి పిస్టల్‌తో బెదిరించారని రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ముఠాతో తనను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య అండతోనే భిక్షపతి వర్గీలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.