‘డబుల్‌’ ఇళ్లకు బ్రేక్‌ | break to double bedrooms Construction | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్లకు బ్రేక్‌

Published Tue, Jun 13 2017 11:45 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

‘డబుల్‌’ ఇళ్లకు బ్రేక్‌ - Sakshi

‘డబుల్‌’ ఇళ్లకు బ్రేక్‌

‘ఇన్‌సిటు’ నిర్మాణాలకు అభ్యంతరాలు
జోషివాడ, జియాగూడ, ఆర్‌కే నగర్‌లో వద్దంటున్న స్థానికులు


గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఈ సంవత్సరం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న అవాంతరాల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. దాదాపు 30 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా, స్థానికుల నుంచి అభ్యంతరాలతో కొన్ని చోట్ల, కోర్టు వివాదాల కారణంగా మరికొన్ని చోట్ల పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది.         – సాక్షి, సిటీబ్యూరో

సిటీబ్యూరో: గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం క్లిష్టంగా మారుతోంది. ఈ సంవత్సరం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. సమస్యల్ని పరిష్కరించి, నిర్మాణం ప్రారంభించేందుకు జాప్యం జరుగుతోంది. మొత్తం లక్ష ఇళ్లకుగాను 90,104 ఇళ్లకు అవసరమైన రూ.7742.58 కోట్లకు పరిపాలనా పరమైన ఆమోదం లభించినా, దాదాపు 30 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా,  స్థానికుల నుంచి అభ్యంతరాలతో కొన్ని చోట్ల, కోర్టు వివాదాలతో కొన్ని చోట్ల పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. 16 ప్రాంతాల్లో  9512 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. లక్ష ఇళ్లకు సరిపడా అవసరమైనన్ని భూముల సేకరణ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్‌మంత్రి కేటీఆర్‌లు త్వరితంగా డబుల్‌ ఇళ్లు పూర్తిచేయాల్సిందిగా ఆదేశించినప్పటికీ, అధికారులు నిస్సహాయులవుతున్నారు. తాజాగా మూడు ప్రాంతాల్లో స్థానికుల అభ్యంతరాలతో 1624 ఇళ్ల నిర్మాణం డోలాయమానంలో పడింది.  

దశల వారీగా నిర్మించాలి..
జియాగూడలో సిల్ట్‌ ప్లస్‌ 5 అంతస్తుల పద్ధతిలో 840 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇక్కడ ఇన్‌సిటు (ఎక్కడ ఉంటున్న వారికి అక్కడే..పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించి, వాటిని కూల్చివేసి నిర్మించే పద్ధతి) విధానంలో డబుల్‌ ఇళ్లు నిర్మించేందుకు గతంలో నిర్మించిన, శిథిలావస్థకు చేరిన మున్సిపల్‌ క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్త ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను పాత ఇళ్లల్లో ఉంటున్న 563 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. అయితే కొత్త ఇళ్లు వెంటనే పూర్తవుతాయని తమకు నమ్మకం లేదని, ఎంతకాలం పడుతుందో తెలియనందున   ఒక్కొక్క బ్లాక్‌కు ఎన్ని ఇళ్లు వస్తాయో..అంతమంది మాత్రమే తొలుత ఖాళీచేస్తారని, ఇళ్ల నిర్మాణం పూర్తయి వారు కొత్త ఇళ్లలో చేరాక మిగతా బ్లాక్‌లోని లబ్ధిదారులు ఖాళీ చేస్తామని వారు భీష్మించుకున్నారు.

అంతేకాకుండా పొజిషన్‌ సర్టిఫికెట్లకు సంబంధించి అందరి పేర్లు ఒకే జాబితాగా పేర్కొని, వాటినే జిరాక్సులుగా ఇచ్చారని, అలా కాకుండా ఎవరి పేరు మీద వారికి విడివిడిగా పొజిషన్లు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పొజిషన్‌ సర్టిఫికెట్లు వ్యక్తిగతంగా జారీ చేసేందుకు ఇబ్బంది లేకున్నా విడతల వారీగా నిర్మాణం కుదరంటున్నారు అధికారులు. ఐదంతస్తుల్లో నిర్మించాల్సిన వీటిని విడతల వారీగా నిర్మిస్తే సిమెంటు, ఇనుము తదితర ధరల్లో తేడా వస్తుందని, ఏవిధంగా చూసినా సాధ్యం కాదంటున్నారు.  ఇక వారిని ఒప్పించేందుకు మునిసిపల్‌మంత్రి కేటీఆర్‌తో తగిన హామీ ఇప్పించాలని భావిస్తున్నారు.

ఖాళీ స్థలంలో నిర్మించాలి..
కార్వాన్‌ నియోజకవర్గంలోని అమ్లాపూర్‌ జోషివాడలో జీ ప్లస్‌ 3 అంతస్తుల్లో 400 ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. అందుకు మున్సిపల్‌ క్వార్టర్లలోని ప్రజలు ససేమిరా అంటున్నారు. నిర్ణీత వ్యవధిలో అధికారులు నిర్మిస్తారన్న నమ్మకం తమకు లేదని, ఉంటున్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయబోమంటున్నారు. పక్కనే ఉన్న ఖాలీస్థలంలో నిర్మించాలని డిమాండ్‌చేస్తున్నారు. ఇప్పటికే తమలో 235 మంది ఇళ్ల పట్టాలున్నాయని, తాముంటున్న ఇళ్లను ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు.

కొందరు ఔనంటూ.. కొందరు కాదంటూ..
ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఆర్‌కే నగర్‌లో జీ ప్లస్‌ 3 అంతస్తుల పద్ధతిలో 384 ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. గుట్టమీద ఉంటున్న 150 మంది కావాలని, గుట్ట కింది భాగంలో ఉన్న దాదాపు 125 మంది వద్దని విభేదాలు తలెత్తడంతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎవరి వారుగా తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుండటం కూడా ఇక్కడ సమస్య కొలిక్కి రాకపోవడానికి ఒక కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఇలా.. ఇన్‌సిటు విధానంలో నిర్మించే ఇళ్లకు  ఆటంకాలు ఎదురవుతుండటంతో గ్రేటర్‌లో డబుల్‌ ఇళ్ల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement