చలివేంద్రాల్లో సొంత వ్యాపారం | Buttermilk purchased from Heritage Foods | Sakshi
Sakshi News home page

చలివేంద్రాల్లో సొంత వ్యాపారం

Published Mon, May 9 2016 6:23 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

చలివేంద్రాల్లో సొంత వ్యాపారం - Sakshi

చలివేంద్రాల్లో సొంత వ్యాపారం

ప్రభుత్వ చలివేంద్రాలకు హెరిటేజ్ ఫుడ్స్ నుంచి మజ్జిగ కొనుగోలు
 
 సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ప్రభుత్వ పథకాల్లోనూ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట. మండే ఎండల్లో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చలివేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మజ్జిగను ముఖ్యమంత్రి సొంత కంపెనీ హెరిటేజ్ నుంచే కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఎండల ధాటికి జనం అల్లాడిపోతుండడంతో అన్ని జిల్లాల్లో చలివేంద్రాలను నెలకొల్పి 45 రోజులపాటు ప్రజలకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఏప్రిల్ 18న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించా రు. ఇందుకుగాను ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున 13 జిల్లాలకు మొత్తం రూ.39 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 25న జీవో జారీ చేసింది. మజ్జిగ పంపిణీని ముఖ్యమంత్రి సంస్థకు మేలు చేసే పథకంగా మార్చేసినట్లు తేటతెల్లమవుతోంది.

 నిధులు హెరిటేజ్ ఖాతాలోకే...
 హెరిటేజ్ కంపెనీ నుంచి పెరుగును కొనుగోలు చేసి, చలివేంద్రాలకు సరఫరా చేయాలని జిల్లా అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ప్రభుత్వ చలివేంద్రాల్లో హెరిటేజ్ కంపెనీ పెరుగుతో చేసిన మజ్జిగనే వినియోగించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి పెరుగును కొనుగోలు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎమ్.ఎమ్.నాయక్ పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, సాలూరు, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, చీపురుపల్లి తహసీల్దార్‌లకు లేఖలు రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరీ ఇంత బరితెగింపా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సహకార డెయిరీల్లో పెరుగు తక్కువ ధరకే లభిస్తున్నా.. హెరిటేజ్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార డెయిరీలకు ఊతమివ్వాల్సింది పోయి ముఖ్యమంత్రి తన సొంత కంపెనీకే కాంట్రాక్టులను కట్టబెడుతుండడం పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చలివేంద్రాలకు ప్రభుత్వం కేటాయించిన రూ.39 కోట్లలో సింహభాగం నిధులు హెరిటేజ్ సంస్థ ఖాతాలోకే వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేసిన చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. ఈ నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రన్న సంక్రాంతి కానుకలో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు జాతీయస్థాయిలో చర్చ జరిగింది.
 
 చలివేంద్రాల్లోనూ చేతివాటమేనా!
 మండే ఎండల్లో బాటసారుల గొంతు తడపాల్సిన చలివేంద్రాలు అధికార పార్టీ నేతల జేబులు నింపుతున్నాయి. ప్రతీ జిల్లాలో దాదాపు 3 వేల చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. వాటిలో మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల జాడే కనిపించడం లేదు. ప్రభుత్వ నిధులు భారీగా దారి మళ్లుతున్నట్లు క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో తాటాకు పాకలు వేసి రెండు కుండలు పెట్టి, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను తామే ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలాప్రాంతా ల్లో ప్రచార ఆర్భాటమే తప్ప నీళ్లు పోసే దిక్కులేదు. బాటసారులే నీళ్లు పోసుకుని తాగి వెళ్లాల్సి వస్తోంది. చలివేంద్రాల ముసుగులో సర్కారు సొమ్మును తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా లూటీ చేస్తున్నా.. ఇదేమిటని అడిగే దిక్కు లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement