ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై! | Bye bye to smart phones | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై!

Published Sun, May 22 2016 3:45 AM | Last Updated on Mon, Aug 20 2018 4:52 PM

ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై! - Sakshi

ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై!

- 2021 నాటికి కనుమరుగు కానుందని అంచనా
- వాటి స్థానంలో ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాధనాలు
- ‘ఎరిక్‌సన్’ సర్వేలో అధిక శాతం ప్రజల అభిప్రాయం
 
 ఇంకో ఐదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు అనేవి లేకుండా పోతాయా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ఆధారంగా పనిచేసే సాధనాలు రానున్నాయా.. అవుననే అంటోంది స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎరిక్‌సన్. కొంతకాలం జపాన్‌కు చెందిన సోనీతో కలసి ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారు చేసింది. ప్రస్తుతం ‘కన్జూమర్ ల్యాబ్స్’ అనే మరో సంస్థను నడుపుతోంది. వినియోగదారుల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను గుర్తించడమే ఈ సంస్థ లక్ష్యం. దాదాపు 40 దేశాలకు చెందిన లక్ష మందిపై సర్వే చేసి ఇటీవలే 2016కు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. 2021 నాటికల్లా స్మార్ట్‌ఫోన్లు ఉండకపోవచ్చని సర్వేలో తేల్చింది. సగానికి పైగా ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని ఎరిక్‌సన్ పేర్కొంటోంది. ఈ సర్వేలోని మరికొన్ని విశేషాలు..

నిర్ణయాల్లోనూ ‘స్మార్ట్’..
 ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇంటర్నెట్ వాడకం విస్తృతమైంది. వ్యక్తులు తీసుకునే నిర్ణయాల్లోనూ ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువవుతోందట. ఉదాహరణకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు అక్కడ ఏ హోటల్ బాగుందో తెలుసుకునేందుకు గతంలో అయితే ఎవరైనా తెలిసిన అడిగేవారు. ఇప్పుడు మాత్రం ఆయా హోటళ్లపై ఇంటర్నెట్‌లో వచ్చిన రివ్యూలను ఎక్కువగా నమ్ముతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు కూడా వివిధ వెబ్‌సైట్ల ద్వారా తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు.

యూట్యూబ్‌లో గంటల కొద్దీ..
 ఈ కాలం యువత ముఖ్యంగా 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారిలో 20 శాతం మంది రోజుకు కనీసం 3 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారని ఎరిక్‌సన్ స్పష్టం చేసింది. ఐదేళ్ల కింద ఇది 7 శాతం మాత్రమే ఉండేది.

ఇటుక, కాంక్రీట్.. అన్నిట్లో సెన్సర్లు..
 ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకలు, కాంక్రీట్‌లోనూ భవిష్యత్‌లో సెన్సర్లు ఇమిడ్చే అవకాశం ఉందని దాదాపు 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో నిర్మాణ లోపాలే కాకుండా నీటి లేకేజీ, చెమ్మ, విద్యుత్ సంబంధిత సమస్యలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో ఇళ్లలో గాలి, తేమ శాతం, ఉష్ణోగ్రతలు నియంత్రించే సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయని చాలామంది అభిప్రాయపడ్డారు.

వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎమర్జెన్సీ నంబర్లు..
 అత్యవసర పరిస్థితుల్లో 108 లేదా 100 నంబర్లకు ఫోన్ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే రానున్న మూడేళ్లలో ఈ పరిస్థితి మారే అవకాశముందని, ఎమర్జెన్సీ సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడం సర్వసాధారణమవుతుందని అధిక శాతం మంది నమ్ముతున్నారు.

ఆరోగ్యంపై నిఘా..
 ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునేందుకు ఫిట్‌బిట్, స్మార్ట్‌ఫోన్ యాప్ వంటి వాడకం ఇటీవల పెరిగిపోయింది. అయితే భవిష్యత్‌లో ‘ఇంటర్నబుల్స్’ రంగంలోకి రానున్నాయి. చిన్న సైజులో ఉండే ఈ హైటెక్ పరికరాలు శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటూ ఆరోగ్య స్థితిపై నిత్యం నిఘా వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ పరికరాలు ఇప్పటికే పరిశోధన దశలు దాటి వాణిజ్యపరంగా రూపుదిద్దుకుంటున్నాయి.  
 - సాక్షి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement