ఇక క్యాబ్ ‘చార్జ్’
♦ అడ్డగోలు వసూళ్లకు అధికార ముద్ర!
♦ రవాణాశాఖ ముందు ప్రతిపాదన
♦ ట్రాఫిక్ జాం, పీక్ అవర్.. అదనపు వడ్డింపును సక్రమం చేసుకునే యత్నం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులను తరలించే వాహనాలు రవాణాశాఖ పరిధిలోకి రావాలి... వాటిపై నియంత్రణా ఆ శాఖదే. కానీ క్యాబ్‌ల విష యంలో ప్రభుత్వం చేతులెత్తేసి రవాణాశాఖ అజ మాయిషీ లేకుండా చేసింది. దీన్ని ఆసరా చేసుకుని క్యాబ్ సంస్థలు అడ్డగోలు చార్జీలతో ప్రయాణికుల ను దోపిడీ చేస్తున్నాయి. తాజాగా దొడ్డిదారి వసూ ళ్లకు ‘అధికారిక ముద్ర’ వేసుకునేం దుకు తెరదీశా యి. ఓ వైపు నగరంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్న తరుణంలోనే బడా క్యాబ్ సంస్థలు రవాణా శాఖ ముందు ప్రతిపాదన ఉంచాయి. దానికి ఆమోదము ద్రపడేలా ప్రభుత్వంలోని కొందరు పెద్దలను ఒప్పించే పనిలో పడ్డాయి.
సొంత రాజ్యాంగానికి ఆమోదం కావాలట..
నగరంలో ఉన్న ఆటోలు రావాణాశాఖ నిబంధనలకు లోబడే తిరుగుతున్నాయి. వాటికి ప్రత్యేకంగా మీటర్లు బిగించి నిర్ధారిత చార్జి మాత్రమే వసూలు చేసేలా ఏర్పాట్లు జరిగాయి. కానీ క్యాబ్‌లు ఎలాంటి నియంత్రణ లేకుండానే పరుగుపెడుతున్నాయి. వాటికి మీటర్ అంటూ ఉండదు. చార్జీలను నియంత్రించే వ్యవస్థ లేదు. ఎంత వసూలు చేసినా ఫిర్యాదు చేసేందుకూ అవకాశం లేదు. దీన్ని ఆసరా చేసుకుని క్యాబ్‌లు ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణంగా కిలోమీటరుకు నిర్ధారిత మొత్తం కలిపి చార్జి చేయాలి. అది తక్కువ మొత్తం ఉంటుండటంతో కొంతకాలంగా క్యాబ్ నిర్వా హకులు వెయిటింగ్ చార్జి, ట్రిప్‌టైం చార్జి, ట్రాఫిక్ జాం చార్జి, పీక్ అవర్ చార్జి.. ఇలా రకరకాల పేర్లతో భారీమొత్తం చార్జి చేస్తున్నారు.
వీటిపై రవాణాశాఖకు ఫిర్యాదులు అందుతున్నా, క్యాబ్‌లపై తమకు నియంత్రణ లేదంటూ వారు చర్యలు తీసుకోవటంలేదు. ఈ నేపథ్యంలో నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ చిక్కులు పెరిగిపోతున్నందున తాము నష్ట పోతున్నామని, ట్రాఫిక్‌లో వాహనం నిలిచిపోతే ఆ నష్టాన్ని ప్రయాణికుడి నుంచి వసూలు చేసేందుకు వెసులుబాటు కల్పించాలని రవాణా శాఖకు ప్రతిపా దించారు. ఈ ప్రతిపాదనకు అధికార ముద్ర వేయించుకునేందుకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొంతమంది చుట్టూ తిరుగుతున్నారు. వీరి ప్రతిపాదనను ప్రభుత్వం కూడా సానుకూలంగానే పరిశీలిస్తోందని సమాచారం.