క్యాబ్ డ్రైవర్లతో రవాణా శాఖ చర్చలు వాయిదా
♦ నేడు మరోసారి చర్చలు
♦ ఉబెర్, ఓలా కాకుండా మిగతా వాళ్లెందుకు?
♦ నిరసన వ్యక్తం చేసిన క్యాబ్‌డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం దిశగా శుక్రవారం రవాణా శాఖ అధికారుల చర్చలు వాయిదా పడ్డాయి. క్యాబ్ డ్రైవర్ల డిమాండ్లపై శనివారం మరోసారి సమగ్రంగా చర్చించాలని అధికారులు నిర్ణయిం చారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలపైప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, సమ్మె పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. మరోవైపు సమస్య ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినది కాగా.. రవాణా శాఖ అధికారులు అందుకు సంబంధం లేని 12 సంఘాలను చర్చలకు ఆహ్వానించడంపై తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది.
తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి సర్వేశ్ తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో జరిగిన చర్చల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రఘునాథ్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఉబెర్, ఓలా సంస్థల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఓలా, ఉబెర్ సంస్థలు కొత్తగా వాహనాలను తీసుకోవడం నిలిపివేయాలని, లీజు పద్ధతిని రద్దు చేయాలని, ఫిక్స్‌డ్ కమీషన్లు చెల్లించాలని, ఎయిర్‌పోర్టు వద్ద వెయిటింగ్ చార్జీలను క్యాబ్ సంస్థలే చెల్లించాలని క్యాబ్ సంఘాలు కోరుతున్నాయి. సుమారు 80 వేల వాహనాలు ప్రస్తుతం రెండు సంస్థల్లో ఉండగా ఇంకా కొత్త వాటిని చేర్చుకోవడం వల్ల తమకు లభించే ప్రోత్సాహకాల్లో కోత పడుతోందని పేర్కొన్నాయి. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను, డిమాండ్లను నమోదు చేసుకున్న అధికారులు ఓలా, ఉబెర్ సంస్థల ప్రతినిధులతో సంప్రదించగా యాజమాన్యాలతో చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని చెప్పారు. దీంతో చర్చలు శనివారానికి వాయిదా పడ్డాయి.
కొనసాగుతున్న నిరాహార దీక్ష..
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. కుషాయిగూడ చక్రిపురంలోని తన నివాసంలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మె సైతం యథాతథంగా కొనసాగుతోంది.