
హర్టీ కేక్స్
కాలంతో కరిగి పోకుండా ఎంతో కాలం పదిలంగా ఉండే శిల్పాలు, బొమ్మలు చాలా చూసి ఉంటారు. వాటిని తాకి నాటి శిల్పుల కళా చాతుర్యానికి ఆశ్చర్య పోతుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నవి మాత్రం అలాంటివి కావు. ఈ కళాత్మక శిల్పాలు తాకినా.. నోటిలో వేసుకున్నా ఇట్టే కరిగిపోతాయి. - ఓ మధు
స్వయంగా చేస్తేనే పర్‌ఫెక్ట్..
సాధారణంగా వర్క్‌షాప్‌లు అనగానే పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తయారీ విధానం చూడటం తప్ప స్వయంగా చేసే అవకాశం వర్క్‌షాప్‌లలో తక్కువ. కానీ నేను అలా కాకుండా 5-8 మంది మాత్రమే వర్క్‌షాప్‌లో ఉండేట్లు చూసుకుంటాను. రెండు రోజుల వర్క్‌షాప్‌లో మెటీరియల్ ఇచ్చి పూర్తిగా వారితోనే కేక్ తయారు చేయిస్తాను. దీంతో వారు పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. అలా నా దగ్గర శిక్షణ తీసుకున్న చాలా మంది హాబీగా మాత్రమే కాకుండా బిజినెస్ పరంగానూ రాణిస్తుండటం ఆనందంగా ఉంది. 20 నుంచి బేసిక్ బేకింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాను. ఆసక్తి గల వారు 8885848635 నంబర్‌లో సంప్రదించవచ్చు. - ప్రసన్న
అలంకరణ, రుచి రెండూ కేక్ తయారీకి ముఖ్యమే. ఈ రెండిటిలో ప్రయోగాలు చేస్తూ అందమైన కేక్ బొమ్మలు మలచడంలో ప్రసన్న దేవిశెట్టి దిట్ట. హాబీని చక్కని వ్యాపార మార్గంగా మలుచుకున్నారీమె. తన నైపుణ్యాన్ని తనకే పరిమితం చేసుకోకుండా కేక్ మేకింగ్, డెకరేటింగ్, చాక్లెట్ మేకింగ్‌లలో నలుగురికి శిక్షణనిస్తున్నారు.
చదువుతూనే పదను పెట్టా..
‘చిన్నప్పటి నుంచి కేక్ తయారీ అంటే సరదా. అప్పుడప్పుడు సన్నిహితులు, బంధువులకు సరదాగా కేక్ తయారు చేసి ఇచ్చేదాన్ని కూడా’ అంటూ గుర్తు చేసుకున్నారు ప్రసన్న. ఎవరికైనా వ్యాపారం ప్రారంభిస్తే ఆర్డర్లు వస్తాయి. అయితే బీటెక్ చదువుతున్నప్పుడే ప్రసన్న ఫస్ట్ ఆర్డర్ అందుకున్నారు. ‘న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి పక్కనే ఉన్న స్కూల్ వాళ్లు 40 కేజీల కేక్ తయారు చేయమని అడిగారు. అదే నా ఫస్ట్ ఆర్డర్. ఖర్చులు, లాభనష్టాలు లెక్కలేసుకోకుండా ఎంతో ఇష్టంగా తయారు చేసి ఇచ్చాను. స్కూల్ నిర్వాహకులు, వందల మంది పిల్లలు తిని చాలా బాగుందన్నారు. చాలా తృప్తిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి నా ఆసక్తిని మరింత మెరుగుపరుచుకొని కేక్ మేకింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ, పెళ్లైన తర్వాత భర్త ప్రోత్సాహం అందించడంతో చెన్నై, బెంగళూర్, పుణె.. ఇలా పలు నగరాలకు వెళ్లి తగిన శిక్షణ
తీసుకున్నానం’టూ వివరించారామె.
పది మందికి నేర్పిస్తూ..
సరదాగా నేర్చుకున్న కేక్, చాక్లెట్ తయారీలో ప్రసన్న సాధిస్తున్న వ్యాపార విజయం.. అనేక మందికి స్ఫూర్తిని అందించింది. దీంతో పలువురు తమకూ నేర్పమంటూ అడగడం ప్రారంభించారు. మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే వ్యాపార పరంగానూ రాణించేందుకు ఇది చక్కని మార్గమని అంటున్న ప్రసన్న.. టీచర్‌గా కూడా మారారు. గృహిణిగా ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కేక్ మేకింగ్ వర్క్‌షాప్‌లు సైతం నిర్వహిస్తూ ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో సైతం క్లాస్‌లు తీసుకుంటారు. అలా ఇప్పటికి 800 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. కేక్ మేకింగ్‌లో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారీ సృజనశీలి. చిన్నప్పటి నుంచి సహజంగా అబ్బిన పెయింటింగ్‌ను కేక్‌లపై ప్రదర్శిస్తూ కొత్త కొత్త ఆర్టిస్టిక్ కేక్స్ అందిస్తున్నారు.